ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన ,నిరసన
నవతెలంగాణ – జమ్మికుంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా కాలయాపన చేస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. బుధవారం  జమ్మికుంట సిపిఎం జోన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో ఆందోళన, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల ఒకటి నుండి ఏడు వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల కు అఖిలభారత కమిటీ పిలుపుమేరకు జిల్లాలో 6,7 తేదీల్లో  మండల కేంద్రాలలో ధర్నాలు, ఎనిమిదవతేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు కుదించడంతో కూలీల బతుకులు ఆగమవుతున్నాయన్నారు.  దేశంలో కుల,మత ఘర్షణలు పెరిగిపోతా ఉన్నాయని, దేశంలో బిజెపి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఒకవైపు పేదలపై బారాలు వేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుందని విమర్శించారు.   దేశంలో కోట్లాది మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని వీరి పై పన్నుల భారం పెంచి మరింత దారిద్రంలోకి నెడుతున్నారన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు 2014లో ఉన్న ధరలను పోల్చిచూస్తే 50 శాతమ్మ నుండి 200 శాతం వరకు పెరిగాయని, నిత్యవసర సరుకులపై 12 శాతం నుండి 18 శాతం పన్నులు వేయడంతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయ న్నారు.దీనికి తోడు విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. పన్నులు తగ్గించడం ద్వారా మాత్రమే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం తెలు సుకోవాలన్నారు. దేశంలో యువత 65 శాతం ఉంటే వీరిలో పెద్ద సంఖ్యలో ఉపాధి ఉద్యోగం కరువై నిరుద్యోగులుగా తిరుగుతున్నారని, ఉన్నత చదువులు చదివిన వారు సైతం కూలి పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని దేశ ప్రధాని హామీ ఇచ్చారని ఆచరణలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, ఈ కాలంలో దాదాపు ఒక కోటి 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్షలాదిగా ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదన్నారు.యువత అసంతృప్తిని మతోన్మాదం వైపు మళ్లించి, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తుందన్నారు. పరోక్ష పన్నులు జిఎస్టి నిత్యవసర సరుకులపై సెస్సులు  వేస్తున్నారని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరంలో సుమారు 20 లక్షల కోట్లు ఆదాయం సమకూరుతుందన్నారు.  పరోక్ష పన్నులు 39 శాతం నుండి 43 శాతానికి పెంచారని దుయ్యబట్టారు. ధనికులపై వేసే ప్రత్యక్ష పన్నులు మాత్రం ఇతర దేశాల్లో 35 శాతం ఉండగా మనదేశంలో 26 శాతం మాత్రమే విధిస్తున్నారన్నారు. ఇది ప్రత్యక్షంగా కార్పొరేట్లకు లాభాలుకట్టబెట్టడమేనన్నారు. రిజర్వు బ్యాంకు మిగులు నిధులను పేదలకు ఉపయోగపడే పథకాలకు బదులుగా కార్పొరేట్లకు ఈ కాలంలోనే నాలుగు లక్షల 69 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించారని, బ్యాంకుల్లో లక్షల కోట్లు రుణాలు తీసుకొని ఎగవేసిన సంస్థలు ప్రభుత్వ సహకారంతో వారు దేశం విడిచి వెళ్లారని దుయ్యబట్టారు. దేశంలో 22 శాతం సంపద ఒక్క శాతం కోటీశ్వరుల చేతుల్లో ఉన్నదని,40 శాతం సంపద కేవలం 20 శాతం మంది వద్ద ఉన్నదని అన్నారు. గత 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు 55 లక్షల కోట్లు ఉండగా మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో 100 లక్షల కోట్లు ఎఫ్ ఆర్ బి ఎం పరిధికి మించి అప్పు చేసిందన్నారు. దీనివల్ల ప్రతి భారతీయుని తలపై ఒక లక్ష పదివేల రూపాయల అప్పు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిందని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని, కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, కార్మికులకు కనీస వేతనాలు సవరించలేదన్నారు. సమ్మెల పట్ల ప్రభుత్వం అసహనాన్ని ప్రదర్శిస్తుందన్నారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పక్కనపెట్టి కొత్తగా గృహలక్ష్మి పథకం తెచ్చారని ,అది కూడా అర్హులైన చెబుతాను పేదలందరికీ అందే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు ఇచ్చి రుణమాఫీ తో పాటు వడ్డీ కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలన్నారు. నిత్యవసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరిచి బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని డిమాండ్ చేశారు. పేదలపై వేసిన పన్నుల భారాన్ని తగ్గించి కార్పోరేట్ సంస్థలపై ఆదాయ పన్నులు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులకు కేటాయింపులను మూడు రేట్లు పెంచాలని, విద్యా, వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని, పేదలందరికీ ఆవాసాలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, పై డిమాండ్ల సాధన కొరకు జిల్లా వ్యాప్తంగా జరిగే నిరసన ఉద్యమాల్లో జిల్లా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్ , జక్కుల రమేష్ యాదవ్, దండి గారి సతీష్, కన్నం సదానందం, నాయకులు రాజకుమారి, రావుల ఓదెలు, రాచపల్లి ఐలయ్య, మధునయ్య, బైరం సమ్మయ్య, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love