– అంగన్వాడీ కేంద్రాలలో ప్రాథమిక విద్య నిర్ణయం వెనక్కి తీసుకోవాలి : పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ మండల, జిల్లా పరిషత్ గిరిజన సంక్షేమ పాఠశాలల మనుగడ తక్షణం తీసుకోవాల్సిన చర్యలు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అవసరమైన చోట పాఠశాలలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ప్రయివేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలను రియార్గనైజ్ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 610 మండలాలకు కేవలం 16 మంది ఎంఈఓలు మాత్రమే ఉన్నారంటే ప్రభుత్వానికి విద్యారంగంపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. పాఠశాల విద్యా పరిస్థితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదన్నారు. అంగన్వాడీి కేంద్రాల్లో ప్రాథమిక విద్య పెట్టే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎ.సింహాచలం, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు మహేష్, టీపీటీఎఫ్ నాయకులు నాగిరెడ్డి, బీఇఎఫ్‌ఎస్‌ఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.