– అరకొర నిధులు కేటాయింపు..8న బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆందోళన
– 16.2 శాతం కేటాయించాలి..కానీ 11 శాతం మించలేదు
– ప్రయివేట్ రంగంలోనూ రిజర్వేషన్ల కల్పనకు బిల్లు ప్రవేశపెట్టాలి
– షెడ్యూల్డ్ కులాల సబ్ ప్లాన్‌ని జాతీయ స్థాయిలో అమలు చేయాలి : దళిత హక్కుల కోసం సమన్వయ కమిటీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 8న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని దళిత హక్కుల కోసం సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఆ కమిటీ నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, ఎంపీ రాధాకృష్ణన్, బి వెంకట్, వి.ఎస్. నిర్మల్, దిరేంద్ర ఝా, రామచంద్ర డోమ్, పల్లికల్, ఎన్ సాయి బాలాజీ, గుల్జార్ సింగ్ గోరియా, విక్రమ్ సింగ్, కమెల్ సింగ్, బీనా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. దళిత సమాజాన్ని ఈ బడ్జెట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లాన్ (ఎస్‌సీఎస్‌పీ)ని జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రయివేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.”దేశంలోని దళితులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు గానూ, అసంఘటిత రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారన్నారు. సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్రం ప్రతి యేటా తగిన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ, దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్ కులాల బడ్జెట్ ఖర్చులు తగ్గుముఖం పట్టాయన్నారు. దళిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు లేకపోగా, సవరించిన బడ్జెట్‌ల ప్రకారం కేటాయించిన నిధులు సైతం తగ్గుముఖం పడుతున్నాయని విమర్శించారు. ”నిటీ ఆయోగ్ సిఫారసులు, దళిత జనాభా ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు రావాల్సిన కేటాయింపులు 16.2 ఉండాలని, కానీ గడిచిన పదేండ్ల బడ్జెట్ అంచనాల్లో బడ్జెట్‌లో 11 శాతం దాటలేదని పేర్కొన్నారు. ఎస్సీలకు కేటాయించిన మొత్తం రూ.1,65,493 కోట్లు కాగా, ఇందులో 3.2 శాతం (రూ.46,195 కోట్లు) మాత్రమే నేరుగా ఎస్సీలకు చేరుతోందన్నారు. కేంద్ర బడ్జెట్ 2024-25లో సామాజిక న్యాయం, సాధికారత శాఖ కోసం నివేదించిన మొత్తం కేటాయింపులు రూ. 13,000 కోట్లని, ఇది 2023-24 తో పోలిస్తే రూ.163 కోట్లు పెరిగిందన్నారు. ఈ కేటాయింపులు 2023-24లో సవరించిన అంచనాల్లో రూ.9,853.32 తగ్గించారన్నారు. షెడ్యూల్డ్ కులాల కోసం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు మొత్తం బడ్జెట్‌లో గణనీయమైన వాటా కేటాయింపు 49 శాతం పొందినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదన్నారు. 2023-24 లో రూ.6,359 కోట్లు కేటాయించగా, అదే ఏడాది సవరించిన అంచనాల్లో రూ.5,400 కోట్ల కేటాయింపు తగ్గిందని తెలిపారు. ఈ దళిత వ్యతిరేక బడ్జెట్ పై దేశవ్యాప్తంగా దళిత హక్కుల కోసం నినదించే సంఘాలు ఆందోళనను నిర్వహించాలని దళిత హక్కుల కోసం సమన్వయ కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు
1. షెడ్యూల్డ్ కులాలను సామాజిక అభివృద్ధిలోకి తీసుకురావడానికి బడ్జెట్‌లో కేటాయింపులను సవరించాలి.
2. ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణను ఆపాలి. బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. దళితులకు ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి.
3. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి నిధుల కేటాయింపు, వినియోగాన్ని నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయాలి.
4. విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో షెడ్యూల్డ్ కులాల వారి భాగస్వామ్యం, సాధికారతను మెరుగుపరచడానికి తగిన వనరులను అందించాలి.
5. పదోన్నతుల్లో రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణను అనుసరించాలి.
6. దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ, ఎస్టీ లైంగికదాడి నిరోధక చట్టాన్ని స్ఫూర్తిగా అమలు చేయాలి.