– సచిన్ సరసన విరాట్ కోహ్లి
– అత్యధిక సెంచరీల రికార్డు సమం
పరుగుల యంత్రం, క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి మరో రికార్డు సమం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో అందని ద్రాక్షగా మిగిలిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును ఆదివారం విరాట్ కోహ్లి సమం చేశాడు. ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అజేయంగా 101 పరుగులు చేసిన కోహ్లి.. కెరీర్ 49వ శతకం సాధించాడు. సచిన్ టెండూల్కర్ 452వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. విరాట్ కోహ్లి 277వ ఇన్నింగ్స్‌లోనే దిగ్గజం సరసన నిలిచాడు. అత్యధిక శతకాల జాబితాలో రోహిత్ శర్మ (31), రికీ పాంటింగ్ (30), సనత్ జయసూర్య (28) టాప్-5లో కొనసాగుతున్నారు. విరాట్ కోహ్లి రికార్డు 49వ వన్డే సెంచరీ బాదటంతో క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ ఏడాది విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఆడుతున్నాడు. ఈడెన్‌గార్డెన్స్‌కు ముందే కోహ్లి ఈ ఘనత సాధించాల్సింది. కానీ ఆస్ట్రేలియాపై చెన్నైలో 85 పరుగులు, న్యూజిలాండ్‌పై ధర్మశాలలో 95 పరుగులు, శ్రీలంకపై వాంఖడెలో 88 పరుగులు చేసిన కోహ్లి.. సెంచరీకి చేరువగా వచ్చి అభిమానులను నిరాశపరిచాడు. బంగ్లాదేశ్‌పై పుణెలో శతకబాదిన కోహ్లి.. సచిన్ రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. ప్రపంచకప్ గ్రూప్ దశలో ఎనిమిది మ్యాచుల్లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు బాదిన కోహ్లి (543) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డికాక్ (550) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ ఏడాది 99.82 స్ట్రయిక్‌రేట్, 72.18 సగటుతో విరాట్ 1000కి పైగా పరుగులు సాధించాడు. ఇలా ఓ ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు చేయటం కోహ్లికి ఇది ఎనిమిదోసారి. సచిన్ టెండూల్కర్ ఏడు క్యాలెండర్ ఇయర్స్ రికార్డును సైతం విరాట్ బద్దలు కొట్టాడు.
ఈడెన్‌గార్డెన్స్‌లో సఫారీపై శతకం నం.49 అంతు సులువుగా దక్కలేదు. ఆరంభంలో రోహిత్, గిల్ ధనాధన్ ఆరంభం అందించినా.. పవర్‌ప్లే అనంతరం పిచ్ నెమ్మదించింది. బ్యాట్ పైకి బంతి రాలేదు. స్ట్రయిక్‌రొటేషన్ చేస్తూ ముందుకు సాగటం ఒక్కటే ముందున్న మార్గం. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లి ఆ పని చేశాడు. పరుగుల వేటతో పాటు చివరి వరకు క్రీజులో నిలవాలనే జట్టు ప్రణాళికలను అమలు పరిచాడు. పిచ్ నెమ్మదించటంతో కోహ్లి, అయ్యర్‌తో పాటు కెఎల్ రాహుల్ సైతం ఓ దశలో తడబాటుకు లోనయ్యాడు. కానీ ఓపిగ్గా క్రీజులో నిలిచి అనువైన బంతుల కోసం ఎదురుచూసిన కోహ్లి.. 119 బంతుల్లో 100 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లోనే కోహ్లి శతకాల అర్థ సెంచరీ పూర్తి చేసుకుంటే అభిమానులకు పండుగే.