అసోంలో డీలిమేటషన్‌పై సుప్రీంలో సవాల్‌

– పది మంది ప్రతిపక్ష నేతల పిటిషన్‌ దాఖలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
అసోం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అనుసరించిన విధానాన్ని సవాలు చేస్తూ అసోంలోని పది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముసాయిదా ప్రతిపాదనను సవాలు చేస్తూ సోమవారం మనోరంజన్‌ తాలూక్దార్‌ (సీపీఐ(ఎం))తో పాటు దేబబ్రత సైకియా, రోకిబుల్‌ హుస్సేన్‌ (కాంగ్రెస్‌), ఘనకాంత చుటియా (టీఎంసీ), మహేంద్ర భుయాన్‌ (ఎన్సీపీ), మునిన్‌ మహంత (సీపీఐ), స్వర్ణ హజారికా (ఆర్జేడీ), అసోంలో డీలిమేటషన్‌పై సుప్రీంలో సవాల్‌ అఖిల్‌ గొగోరు (రైజోర్‌ దళ్‌), లూరింజ్యోతి గొగోరు (అస్సాం జాతీయ పరిషత్‌), దిగంత కొన్వర్‌ (అంచలిక్‌ గణ మోర్చా) సహా తొమ్మిది ప్రతిపక్ష పార్టీలకు చెందిన 10 మంది నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీరి తరపున న్యాయవాది ఫుజైల్‌ అహ్మద్‌ అయ్యూబీ పిటిషన్‌ దాఖలు చేశారు. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8ఏ ని కూడా పిటిషన్‌ లోసవాలు చేశారు.దీని ఆధారంగా ఈసీఐ డీలిమిటేషన్‌ ప్రక్రియను నిర్వహించడంలో తన అధికారాన్ని వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
జూన్‌ 20న జారీ చేసిన ముసాయిదా ఉత్తర్వులతో అస్సాంలోని 126 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిని సరిదిద్దుతూ ఈసి చేసిన ప్రతిపాదనలను పిటిషనర్లు సవాలు చేశారు. ఈ ప్రక్రియ కోసం ఈసీఐ అనుసరించిన పద్దతి వివిధ జిల్లాలకు వేర్వేరు సగటు అసెంబ్లీ పరిమాణాలను తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ ప్రక్రియలో జనసాంద్రత ఎలాంటి పాత్ర పోషించదనేది వారు ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలు దాదాపు సమాన జనాభా ఉండేలా భారత రాజ్యాంగం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావించినప్పటికీ, 2001 జనాభా లెక్కల ఆధారంగా ఈసీఐ మూడు వర్గాలను సృష్టించిందని పిటిషన్‌ లో పేర్కొన్నారు. జిల్లాలను మూడు కేటగిరీలగా వేర్వేరు ప్రమాణాలను తీసుకున్నారని తెలిపారు. దీని ఫలితంగా అతిపెద్ద, అతిచిన్న నియోజకవర్గాల జనాభా మధ్య 33 శాతం వరకు తేడా ఉందని పిటిషనర్లు వాదించారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8ఏ కి సవాలు విషయానికొస్తే, అసోం రాష్ట్రానికి ఈ నిబంధన ఏకపక్షంగా, అపారదర్శకంగా, వివక్షపూరితంగా ఉందని పిటిషనర్లు వాదించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు డీలిమిటేషన్‌ను రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని ఉన్నతాధికార సంస్థ నిర్వహించిందని, జమ్మూ కాశ్మీర్‌కు కూడా ఇదే విధమైన కమిషన్‌ ఏర్పాటు చేయబడిందని పిటిషన్‌ లో ఎత్తి చూపారు. ”అయితే, సెక్షన్‌ 8ఏ నిబంధన అసోం, మూడు ఈశాన్య రాష్ట్రాలపై వివక్ష చూపుతుంది. దీని కోసం ఎన్నికల కమిషన్‌ డీలిమిటేషన్‌ నిర్వహించే అధికారంగా పొందింది” అని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ప్రస్తుత కసరత్తు ఒక పార్టీకి అంటే బీజేపీకి లాభదాయకంగా ఉంటుందని, ఇతర ప్రతిపక్ష పార్టీలకు నష్టం కలిగించేలా ఉంటుందని అసోం ముఖ్యమంత్రి చేసిన కొన్ని బహిరంగ ప్రకటనలను కూడా పిటిషన్‌ లో హైలైట్‌ చేశారు. ఇటువంటి ప్రకటనలు ప్రక్రియపై ఎటువంటి విశ్వాసాన్ని కలిగించదని, ఈసీఐ ప్రక్రియ స్వతంత్రంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వంచే నిర్దేశించబడిందనే భయాలను కూడా కలిగిస్తుందని పిటిషనర్లు సమర్పించారు. అసోంతో సహా నాలుగు ఈశాన్య రాష్ట్రాల డీలిమిటేషన్‌కు సంబంధించి దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కూడా సుప్రీంకోర్టు సీజ్‌ చేసింది. అసోంలో ప్రక్రియను ఈసీఐ ప్రారంభించే ముందు ఇవి దాఖలు అయ్యాయి.

Spread the love