సంపద్రాయాలను సవాలుచేస్తూ..

సంపద్రాయాలను సవాలుచేస్తూ..ఈ మహిళా ఖాజీలు ముస్లిం వివాహ వ్యవస్థలో సమానత్వం కోసం పోరాడుతున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకొని శతాబ్దాల నాటి సాంప్రదాయాలను సవాలు చేస్తున్నారు. అంతేకాదు మహిళలను ఖాజీలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. లింగ న్యాయం, సమ్మతి, వివాహంలో సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చే సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్న ‘ట్రిపుల్‌ తలాక్‌’ పద్ధతి సరైనది కాదని 2017లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాక ఈ ఆచారాన్ని నేరంగా పరిగణిస్తూ ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లో పార్లమెంటు సైతం ఆమోదించింది. అయితే ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసినా దీని వల్ల ముస్లిం మహిళల సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (BMMA) వ్యవస్థాపకులు నూర్జెహాన్‌ సఫియా నియాజ్‌, జాకియా సోమన్‌. వివాహ వ్యవస్థలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరింత లోతైన కృషి జరగాల్సి వుందని గుర్తించారు.
సంస్కరించడానికి మార్గాలు
‘చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ అమ్మాయిలు గృహహింసకు గురౌతున్నారు. రాత్రికి రాత్రే బయటకు నెట్టివేయబడుతున్నారు. అలాగే ఆ మహిళలు ఆర్థిక భద్రత కోల్పోవడం మేము గమనించాము. ఈ సమస్యలకు ప్రాథమిక ఉత్ప్రేరకాలలో ఒకరు మగ ఖాజీలు, వారు అనుసరిస్తున్న విధానాలు అలాగే అణచివేతను ప్రోత్సహించే సంప్రదాయాలు’ అని నియాజ్‌ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. చిన్న వయసు బాలికల వివాహాలు జరపడం, బహుభార్యాత్వం, హింసాత్మక చరిత్ర కలిగిన వరుడితో పొత్తులు పెట్టుకోవడం, ట్రిపుల్‌ తలాక్‌కు సహాయకులుగా లేదా సాక్షులుగా ఈ మగ ఖాజీలు వ్యవహరిస్తున్నారని BMMA కనుగొంది. అందుకే ఇస్లామిక్‌ చట్టం ప్రకారం వివాహాలను నియంత్రించే పద్ధతులను, సంస్కరించడానికి మార్గాలను ఈ సంస్థ సభ్యులు అన్వేషించారు. అందులో భాగంగా 2017లో 13 మంది మహిళలకు ఖాజీలుగా మారడానికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
ఖురాన్‌ మమ్మల్ని నిషేధించలేదు
‘ప్రస్తుతం ఉన్న పితృస్వామ్య సంస్థల నుండి ధృవీకరణను కోరుకునే బదులు లింగ న్యాయాన్ని ప్రతిబింబించే సమాంతర నిర్మాణాన్ని రూపొందించాలని మేము నిర్ణయించుకున్నాం’ అని నియాజ్‌ చెప్పారు. దీని కోసం ఇంటా, బయట ఎదురైన ప్రతిఘటనను అధిగమించారు. సీనియర్‌ మగ ఖాజీలు, మతపరమైన సంస్థలను కూడా సంప్రదించారు. కానీ వారు BMMA చొరవను ‘అన్‌-ఇస్లామిక్‌’ అని కొట్టిపారేశారు. ఇది షరియాకు వ్యతిరేకంగా వెళుతుందన్నారు. అయితే ఇది కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని, మతగ్రంథాలను వక్రీకరించి చెబుతున్నారని నియాజ్‌ అంటున్నారు. ‘వీరిని ఖాజీలుగా ధృవీకరించే ఎలాంటి సంస్థ ఇప్పటి వరకు లేదు. వారు మదర్సాలో చదువుతారు లేదా వారి తండ్రుల నుండి ఖాజీని వారసత్వంగా పొందుతారు’ అని ఆమె చెప్పారు. మహిళలు ఖాజీలుగా మారడాన్ని ఖురాన్‌ నిషేధించలేదని BMMA సభ్యులు స్పష్టంగా చెప్పారు. అందుకే వారు తమ న్యాయ, మతపరమైన విధులను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం BMMA దారుల్‌ ఉలూమ్‌ నిస్వా అనే ఒక రిజిస్టర్డ్‌ ఎన్‌జోఓని స్థాపించింది. ఇది మహిళా ఖాజీలను ధృవీకరిస్తుంది. వారికి మతపరమైన, చట్టపరమైన మద్ధతను ఇస్తుంది. మహిళా ఖాజీలను ధృవీకరించే సంస్థ భారతదేశంలోనే మొదటిది దారుల్‌ ఉలూమ్‌ నిస్వా. ముంబై, జైపూర్‌, భోపాల్‌తో సహా పలు నగరాల్లో ఇది విస్తరించి ఉంది. విద్వాంసులు, BMMA సభ్యులతో విస్తృతమైన సంప్రదింపులు చేసి రూపొందించబడిన పాఠ్యప్రణాళిక, వివాహాలను నిర్వహించడానికి ఖురాన్‌ సూత్రాలు, రాజ్యాంగ చట్టాలు, ఆచరణాత్మక మార్గదర్శకాలను ఇది ఏకీకృతం చేస్తుంది.
వీరు ఏం చేస్తారంటే..?
వివాహానికి ఇరు పక్షాలు స్వేచ్ఛగా సమ్మతిస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రత్యేకించి తక్కువ వయసు గల అమ్మాయిలకు అవసరమైన మద్దుతు ఇస్తారు. అలాగే వధువుకు అందవలసిన ఆర్థిక హక్కులు అందేలా చేస్తారు. ఇస్లామిక్‌ చట్టం నిర్దేశించినట్లుగా, వధువు న్యాయమైన మెహర్‌ (తప్పనిసరి వివాహ బహుమతి, ఎక్కువగా ద్రవ్యం) పొందేలా చేయడంపై దృష్టి పెట్టారు. అలాగే వరుడి వైవాహిక స్థితి, ఆర్థిక స్థిరత్వాన్ని ధృవీకరించడం కోసం శిక్షణ పొందిన మహిళా ఖాజీలు సమగ్ర తనిఖీలను చేస్తారు. ‘మా నియమం ప్రకారం ఒకసారి పెండ్లయిన మగాడు మళ్లీ పెండ్లి చేసుకోవడానికి అనుమతించం. వివాహానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులైన ఆర్టికల్‌ 21 (జీవిత హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్‌ 14 (సమానత్వం హక్కు) మొదలైనవాటిని అధ్యయనం చేసాం. ఖురాన్‌తో పాటు మేము రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను కూడా మా సిలబస్‌లో చేర్చాము’ అని నియాజ్‌ చెప్పారు. ఈ విధంగా తరతరాలుగా పురుష ఖాజీలు సమర్థించిన లింగ వివక్షతను ఎదుర్కొన్న మహిళల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని BMMA పాఠ్యాంశాలను రూపొందించింది.
మతం మనల్ని ఆపలేదు
ముంబైకి చెందిన నర్గీస్‌ తారిక్‌ హుస్సేన్‌ గత 28 ఏండ్లుగా BMMAతో కనెక్ట్‌ అయ్యారు. ఆరేండ్ల కిందటే ఆమె ఖాజీగా శిక్షణ పొందడం ప్రారంభించారు. కొంతమంది మగ ఖాజీలు తమ వివాహాలను జరుపుకోవడానికి కొన్ని నిమిషాల ముందు జంటలను కలుసుకునేవారు. అయితే నర్గీస్‌ మాత్రం నికాహ్ కు కనీసం ఒక నెల ముందు నుండే వారితో సన్నిహితంగా ఉండటం, నేపథ్య తనిఖీలు చేయడం, కౌన్సెలింగ్‌ సేవలను అందించడం, వివాహం తర్వాత అమ్మాయికి సురక్షితమైన స్థలం ఉందని నిర్ధారించడం ప్రారంభించారు. ‘మేము ఎంత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా ఉంటామో మా పని అంత నైతికంగా, క్రమబద్ధంగా మారుతుందని గ్రహించాం. మతం మనల్ని ఆపలేదు, దేశ చట్టం మనల్ని ఆపలేదు. చాలా అవసరమైన సమగ్ర మార్పుగా దీన్ని మేం భావించాం. ఒక చిన్న అడుగుగా ప్రారంభించాం’ అని నియాజ్‌ చెప్పారు.
అవగాహనలో మార్పు
మొదట్లో మహిళలు ఖాజీలుగా శిక్షణ తీసుకునేందుకు అంగీకరించపోయినా BMMA అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి BMMA 20 మంది మహిళా ఖాజీలను ధృవీకరించింది. అయితే వారు ఇప్పటివరకు మూడు వివాహాలను మాత్రమే జరిపారు. వీటిలో ఒకటి ముంబైలో మతాంతర వివాహం, సిమ్లా, కోల్‌కతాలో ఒక్కొక్కటి ఉన్నాయి. వీరు జరిపిన వివాహాలు అతి తక్కువే అయినా సమాజ అవగాహనలో మార్పు తీసుకొచ్చే కృషి చేస్తున్నారు. ‘ఇప్పుడు మా దృష్టి మొత్తం మహిళా ఖాజీల నెట్‌వర్క్‌ను విస్తరించడంపైనే ఉంది’ అని నియాజ్‌ అంటున్నారు. ఇస్లాం మతంలోని లింగ సమానత్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అనేక మంది యువకుల భాగస్వామ్యంతో వీరి పని చేస్తున్నారు. ‘ఈ ఉద్యమానికి యువత కీలకం. అలాగే మా పని కేవలం ముస్లిం మహిళల కోసం మాత్రమే కాదు. మతం సాధికారతకు శక్తిగా ఉండాలి, అణచివేతకు కాదు. ఇది అన్ని వర్గాలకు అందించవలసిన సందేశం’ అంటూ నియాజ్‌ తన మాటలు ముగించారు.

Spread the love