12న చలో హైదరాబాద్‌కు హైకోర్టు ఉద్యోగుల మద్దతు

High Court employees support Chalo Hyderabad on 12th–  దక్షిణాదిలో సీపీఎస్‌ను రద్దు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ కావాలి : టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పెన్షన్‌ స్కీం (ఓపీఎస్‌)ను అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి హైకోర్టు ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శనివారం సర్వీస్‌ అసోసియేషన్‌ హైకోర్ట్‌ ఫర్‌ ధ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ నాయకులు ఖాద్రి అధ్యక్షతన, నిశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల గుండా పాత పెన్షన్‌ సాధన సంకల్ప రథయాత్ర చేపట్టామని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దు పాత పెన్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని రాష్ట్రంలోని సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏకమయ్యారని చెప్పారు. ‘అభి నహి తో కభి నహి’ అనే నినాదంతో ఈనెల 12న 3.30 లక్షల మంది గళం ప్రభుత్వానికి తెలిసేలా చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
డీఎస్‌ నకరా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 1982, డిసెంబర్‌ 17న వెలువడిన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం పెన్షన్‌ అనేది ఉద్యోగి హక్కు అని ప్రకటించిందని వివరించారు. ఉద్యోగి విశ్వాసంగా చేసిన సేవలకు కంపెన్షన్‌ మాత్రమే కాదనీ, పెన్షన్‌ చెల్లింపులో సామాజిక, ఆర్థిక, న్యాయం, వృద్ధాప్య భద్రత దాగి ఉన్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసే తొలి రాష్ట్రం తెలంగాణ కావాలని స్థితప్రజ్ఞ అన్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్‌ ఛత్తీస్గడ్‌ జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌, సర్వీసెస్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ రెడ్డి, కోశాధికారి వెంకటేష్‌, నాయకులు సతీష్‌, సీపీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కోటకొండ పవన్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు, నాయకులు శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love