– వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీలను రూ.2,500లకు పెంచాలనీ, డీఏహెచ్ హాస్టల్ విద్యార్థులకు ప్యాకెట్ మనీ రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న చలో సంక్షేమ భవన్ కార్యక్రమాన్ని తలపెట్టామని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద చలో హైదరాబాద్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు అనేక సమస్యలతో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీగా పెరుగుతున్న నిత్యావసర ధరలు, కూరగాయల ధరల వల్ల ప్రస్తుతం ఇస్తున్న మెస్ చార్జీలు రూ.1,250 సరిపోవడం లేదన్నారు. దీంతో నాణ్యమైన ఆహారానికి నోచుకోవటం లేదని చెప్పారు. ధరల పెరుగుదలతో నాసిరకమైన భోజనం పెట్టడం వల్ల విద్యార్థులు పౌష్టికాహార లోపానికి గురవుతున్నారని అన్నారు. మెస్ చార్జీలను రూ.2,500, కాస్మోటిక్ చార్జీలను బాలికలకు రూ.500, బాలురకు రూ.300లకు పెంచాలని డిమాండ్ చేశారు. కళాశాల స్థాయి కలిగిన హాస్టల్ విద్యార్థులకు ప్యాకెట్ మనీ రూ.500 కేవలం నాలుగు నెలలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్యాకెట్ మనీని రూ.2,500లకు పెంచాలని కోరారు. అరకొర సౌకర్యాలతో ఇరికిరుకు గదులతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తక్షణమే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకి మెడికల్ చెకప్‌లు నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది అమలుకు నోచుకోవటం లేదన్నారు. క్రీడా సామగ్రి చాలా హాస్టళ్లలో అందలేదని చెప్పారు. విద్యార్థులకు గ్రంథాలయాల ద్వారా సాహిత్యం కొనుగోలు చేసి ఇవ్వాలన్న నిబంధన ఉన్నా గైడు, టెస్ట్ పేపర్లు వంటివి అందుబాటులో ఉంచడం లేదని అన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావా లని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తిప్పారపు సురేష్, ఎం ప్రకాష్ కరత్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం దశరథ్, నాయకులు రజనీకాంత్, పూజ, వినరు సాగర్, వినోద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.