నవతెలంగాణ – న్యూఢిల్లీ: కర్ణాటక సీఎం విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను హై కమాండ్ నిర్ణయించినట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. సీఎం పోస్టు కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎన్నిక విషయంలో జాప్యం చేస్తోంది. ఇవాళ కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేతల్ని కలిశారు. కొన్ని వర్గాల ప్రకారం డీకే శివకుమార్ ఎటువంటి పోస్టును ఆశించడం లేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు డీకే సిద్ధంగా లేరని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్‌లో ఏ స్థానాన్ని ఆయన ఆశించడం లేదని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్ని వర్గాలు మాత్రం డీకే.. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునే ఛాన్సు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. అయితే సీఎం సిద్ధరామయ్యే అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. డీకే శివతో సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత సీఎం బాధ్యతలను డీకే శివకుమార్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. పవర్ షేరింగ్ గురించి సోనియా, రాహుల్‌తో డీకే మాట్లాడినట్లు స్పష్టమవుతోంది.