– టీడీపీతో కలిసే పోటీ : స్పష్టతనిచ్చిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్
అమరావతి : ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లేప్పుడు జరిగిన ఘటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులైన ముదివేడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అన్నమయ్య జిల్లా ఎస్‌పీకి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ కె సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదివేడు పోలీసులు తనపై కేసు (79/2023) నమోదుచేశారని, ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందుగా అనుమతి తీసుకున్నామని, అంగళ్లు కూడలికి ర్యాలీ చేరుకోగానే అధికారపార్టీ వాళ్లు కాన్వాయిపై రాళ్లు వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివరాలు సమర్పించేందుకు వారం రోజుల గడువు కావాలని పోలీసుల తరపున అదనపు పిపి దుష్యంత్ రెడ్డి కోరడంతో హైకోర్టు అనుమతినిచ్చింది.
నారాయణ కేసులు 25కు వాయిదా
రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై మాజీ మంత్రి పి నారాయణ, ఇతరులపై 2020లో సిఐడి నమోదు చేసిన కేసును సవాల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. ఇదే తరహాలోని పిటిషన్లను కూడా ఈ వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలోని మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది. ఈ నెల 25న జరిగే విచారణలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
చంద్రబాబుతో జనసేన నేత ములాఖాత్
రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ‘స్కిల్’ స్కామ్‌లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి ఆయన గురువారం ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల ములాఖాత్ అనంతరం బాలకృష్ణ, లోకేష్‌లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలు ఉండటంతో విడిగా పోటీ చేశాం. మా నాన్న అస్థికలు కాశీలో కలపడానికి వెళ్లినప్పుడు ముంబైలో బాంబు దాడి జరిగింది. తరువాత పార్లమెంట్‌పై దాడి జరిగింది. దేశానికి బలమైన నాయకుడు కావాలనే ఆకాంక్షతో మోడీకి మద్దతు తెలిపాను. నాటి నుంచి నేటి వరకూ మోడీ పిలిస్తేనే వెళ్లాను’ అని అన్నారు. చంద్రబాబు రిమాండ్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపే అని అన్నారు.