ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్

నవతెలంగాణ అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్‌ (Skill Development) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు(AP High Court).. నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.
నవంబర్‌ 10న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. తాజాగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశముంది.

Spread the love