చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు

– ఏదైనా జరిగితే సిఎం, ప్రభుత్వానిదే బాధ్యత
– టిడిపి నేతలు
అమరావతి : తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్‌, చర్మ సంబంధిత సమస్యల వల్ల జైల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల సుమారు ఐదు కిలోల బరువు తగ్గారని టిడిపి ముఖ్యనేతలు అన్నారు. ఆయన ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని, బోండా ఉమామహేశ్వరరావులు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, బుద్ధా వెంకన్న శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం వాస్తవాలు తొక్కిపెడుతోందని ఆరోపించారు. ఒకేసారి ఐదు కిలోల బరువు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. చంద్రబాబును పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం వారి గొంతు నొక్కేసిందని చెప్పారు. వచ్చిన సమస్యకు, వైద్యులు రాసిచ్చిన మందులకు సంబంధం లేదన్నారు. స్టెరాయిడ్స్‌ అధికంగా ఉన్న మందులను ఆయనకు రాసిచ్చారని పేర్కొన్నారు. ఉత్తమమైన వైద్య సేవలు అందించేలా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. తక్షణమే చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల పర్యవేక్షణలో ఉండే ఏర్పాట్లు చేసి ఎయిమ్స్‌లో గానీ, ప్రైవేటు ఆస్పత్రిలో గానీ నాణ్యమైన వైద్య సేవలు అందే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని జైళ్లశాఖ డిజితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాజమండ్రి జైల్‌ సూపరింటెండెంటుకు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
చంద్రబాబు ప్రాణాలకు ముప్పు : లోకేష్‌, బాలకృష్ణ
చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల్లో ఐదు కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తమకు ఆందోళనగా ఉందని నారా బ్రాహ్మణి మరో ప్రకటనలో పేర్కొన్నారు.
చంద్రబాబు భద్రత, ఆరోగ్య పరిస్థితిపై గవర్నరుకు లేఖ
చంద్రబాబుకు భద్రత, ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు వైసిపి ఎంపి రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు హానికర స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love