నవతెలంగాణ-కొత్తగూడ:-స్కిల్ స్కాం పేరుతో అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును బేషరతుగా విడుదల చేయాలని టిడిపి మండల అధ్యక్షులు గట్టి సుధాకర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో టిడిపి మండల కమిటీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులను జీర్ణించుకోలేని వైయస్సార్సీపి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జగన్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. బేషరతుగా కేసులను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.చంద్రబాబును విడుదల చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నాయకులు బానోతు బద్రు, బానోతు లక్ష్మణ్, జరుపుల రవి, అజ్మీర కుమార్,జరుపుల నాజ, మల్లెల రమణయ్య తదితరులు పాల్గొన్నారు.