చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కన్నుమూత

Chandrababu's brother Ram Murthy Naidu passed away– నేడు నారావారి పల్లెలో అంత్యక్రియలు
– సీఎం రేవంత్‌ సహా పలువురి సంతాపం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, సినీ హిరో నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. శనివారం మధ్యాహ్నం సమయంలో గుండెపోటు రావడంతో రామ్మూర్తినాయుడు తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు, సోదరుడి మరణవార్త తెలుసుకుని తన మహారాష్ట్ర పర్యటనను రద్దుచేసుకుని ప్రత్యేక విమానంలో హుటాహుటిన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నేరుగా ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మంత్రి నారా లోకేష్‌ కూడా అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు.రామ్మూర్తినాయుడు వైద్యచికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పపత్రికి నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా వచ్చారు. శనివారం మధ్యాహ్నం 12:45 గంటలకు మృతి చెందినట్టు ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. రామ్మూర్తినాయుడికి భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్‌, గిరీష్‌ ఉన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎన్‌వి రమణ, నందమూరిబాలకృష్ణ తదితరులు కలిసి రామ్మూర్తినాయుడు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
నారావారిపల్లెలో నేడు అంత్యక్రియలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామ్మూర్తినాయుడు కన్నుమూశారనే వార్త తెలియగానే నారా, నందమూరి కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రికి చేరుకున్నారు. అంత్యక్రియలు ఆదివారం రామ్మూర్తినాయుడి స్వగ్రామమైన నారావారిపల్లెలో నిర్వహించనున్నారు. రామ్మూర్తినాయుడు మృతికి సినీ, రాజకీయ నాయకులు నివాళులర్పించారు.
ఎమ్మెల్యేగా..
1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా పని చేశారు. ఆయన కుమారుడు నారా రోహిత్‌ నిశ్చితార్థం ఇటీవల ‘ప్రతినిధి 2’ హీరోయిన్‌ సరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. వారి పెండ్లి సరిగ్గా నెలరోజులు ఉందనగా రామ్మూర్తినాయుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
తమ్ముడి ఆత్మకు శాంతి కలగాలి:చంద్రబాబు
‘నా తమ్ముడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు. ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు, మా నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుం టున్నా’ అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
పిన్ని..తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలి:లోకేష్‌
‘చిన్నాన్న రామ్మూర్తినాయుడు మృతి తీవ్ర విషాదం నింపింది. ఆయనతో నా చిన్ననాటి అనుబంధం కండ్ల ముందు కదలాడుతున్నది. కన్నీటితో నివాళులు అర్పిస్తున్నా. ఇన్నాళ్లూ ఆయన మాకు కనిపించే ధైర్యం, ఇకపై చిరకాల జ్ఞాపకం, ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అంతులేని దు:ఖంలో ఉన్న నా సోదరులు, పిన్ని ధైర్యంగా ఉండాలని కోరుతున్నా”
సీఎం రేవంత్‌ సంతాపం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణంపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలనీ, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, తీవ్ర సంతాపం, సానుభూతి తెలిపారు.
చింతిస్తున్నా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌
రామ్మూర్తినాయుడు మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.
తెలంగాణ టీడీపీ సంతాపం
మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడు మృతి పట్ల తెలుగుదేశం తెలంగాణ శాఖ నేతలు బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.

Spread the love