నవతెలంగాణ హైదరాబాద్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి రాజమహేంద్రవరం కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు రెండోదఫా విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జైలు పర్యవేక్షణాధికారి రాహుల్ వద్ద ప్రస్తావించగా తమకు ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదన్నారు. సూచనలు వస్తే ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి రిమాండ్ ముగిసిన తర్వాత చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌లో హాజరయ్యేలా ఏర్పాటు చేశారు. అప్పుడు రెండ్రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో జైలులోనే అధికారులు విచారించారు. ఆ తర్వాత కూడా వర్చువల్‌లోనే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా అక్టోబరు 5 వరకు రిమాండ్ విధించిన విషయం విధితమే.