నాయకుని లక్షణం

సింహగిరి అడవికి రాజు సింహం. అది తన రాజ్యాన్ని చక్కగా పాలించేది. ఆ సింహానికి ముసలితనం రావడం వలన రాజ్యపాలన కష్టమయింది. అందుకు అడవిలో ఉన్న జంతువులన్నింటినీ ఒకరోజు సమావేశపరచింది. నేనింక రాజ్యపాలన చేయలేను. అందుకుగాను దుర్బుద్ధి అనే తోడేలు చాలా చాకచక్యం కలది, ధైర్యం కలది. సుబుద్ధి అనే కుందేలు చాలా తెలివి కలది, ఇతరుల మేలుకోరేది. అందుకే దుర్బుద్ధికి, కుందేలుకి నేను పోటీ పెడుతున్నాను.మీరందరూ ఎవరికి ఎక్కువ మద్దతు ఇచ్చి గెలిపిస్తే వారినే రాజు చేస్తా అని చెప్పింది. సింహం మాటలకు అన్ని జంతువులు ‘చిత్తం రాజా!’ అన్నాయి. కుందేలు పార్టీ గుర్తు కోడిపుంజు. తోడేలు పార్టీ గుర్తు క్యారెట్‌. ఈ రెండు జంతువులు అడవంతా తిరుగుతూ ఓట్లు అడుగుతున్నాయి. ఇలా రెండు రోజులు అయ్యాక తోడేలుకి కుందేలు గాని, దాని పార్టీ గుర్తుగాని గుర్తు వస్తే చాలా కోపం వచ్చేది. అందుకుగాను అడవిలో ఒక్క కోడిపుంజు కూడా లేకుండా అన్ని చంపి తినేసింది. ‘అబ్బో! తోడేలిది ఏమి కుట్టిల బుద్ధి అనుకున్నాయి’ మిగతా జంతువులు. అప్పుడు అన్ని జంతువులు కుందేలు దగ్గరికి వచ్చి ”తోడేలు దుర్బుద్ధితో అడవిలోనున్న కోడిపుంజులన్నింటినీ తినేసింది, నువ్వేంటి ఏమీ పట్టనట్టు ఉన్నావు” అని చెప్పాయి. కుందేలు వారందరి మాటలకి ఒక నవ్వు నవ్వేసింది. ”ఓ స్నేహితులారా! తోడేలు చేసే పని నాకు తెలుసు. కానీ దాని పాపాన అదే పోతుంది. దానిపైన దానికే నమ్మకం లేక ఇలా చేస్తుంది” అని అక్కడున్న జంతువులతో చెప్పింది.
ఏమిటో! ఈ కుందేలుకి రాజవ్వాలని లేదా అని అనుకుని జంతువులన్నీ వెళ్ళిపోయాయి. అడవిలో వద్ధులైన ఏనుగు, ఎలుగుబంటి, పులి, సింహం అంతా కలిసి ‘కుందేలు సుబుద్ధి చాలా తెలివైనది. తన తెలివితో అడవిని నిస్వార్థ బుద్ధితో పరిపాలించగలదు. కానీ అడవిలో జంతువులన్నీ ఎవరిని గెలిపిస్తాయో అర్థం కావడం లేదు’ అని మాట్లాడుకుంటున్నాయి.
ఇంతలో పోటీ జరిగే సమయం వచ్చింది. అడవిలో జంతువులన్నీ తన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నాయి. ఆ తరువాత రోజు రాజైన ముసలి సింహం తన మంత్రితో పోటీ చేసిన ఇద్దరి జాబితాలోనూ లెక్కింపు చేసింది. అందులో ఎక్కువ ఓట్లు సుబుద్ధి అయిన కుందేలుకి వచ్చినయి. దానితో కుందేలుని ఆ సింహం రాజు చేసినది.
‘ఓహో…! ఒహో…!’ అని అరుస్తూ జంతువులన్నీ ఆనందించాయి. సింహం కుందేలుని ఇలా అంది… ”నాకేంటి అని అడిగేవాడు నాయకుడు కాలేడు. నీకేం కావాలి అని అడిగేవాడు మాత్రమే నాయకుడు అవుతాడు” అని తన రాచరికపు బుద్ధితో హితవు చెప్పింది సింహం. కుందేలు సుబుద్ధి రాజు అయి జంతువుల అవసరాలన్నీ తీర్చి వాటికి చేదోడు, వాదోడుగా ఉండి మంచి రాజు అనిపించుకుంది.

– బల్ల కృష్ణవేణి

Spread the love