– ఆధారాలు లభించలేదు…
– పోక్సో కేసు ఎత్తివేయాలి
– ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం ఛార్జిషీటు దాఖలు చేశారు. రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించినట్టు నమోదైన కేసులో పాటియాలా హౌస్ కోర్టులో ఈ ఛార్జిషీటును దాఖలు చేశారు. దాడి, లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, వెంబడించడం వంటి అభియోగాలపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆయన సహాయకుడు వినోద్ తోమర్‌పై స్థానిక కోర్టులో 1,082 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. సింగ్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 (దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో దాడి, నేరపూరిత బెదిరింపు), 354ఏ (లైంగిక వేధింపులతో కూడిన వ్యాఖ్యలు చేయడం), 354డీ (వెంబడించడం) కింద అభియోగాలు మోపినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రణవ్ తాయల్ తెలిపారు. తోమర్‌పై ఐపీసీ సెక్షన్లు 109, 354, 354ఏ కింద అభియోగాలు మోపారు. ఇద్దరిని అరెస్టు చేయడం తప్పనిసరి కాదని తయాల్ అన్నారు. నిందితులకు వ్యతిరేకంగా దర్యాప్తు అధికారులు సాక్ష్యాలను కనుగొన్నారనీ తెలిపారు. ఓవర్సీస్ రెజ్లింగ్ ఫెడరేషన్ల నుంచి కోరిన వివరాలు ఇంకా అందలేదు కాబట్టి, నిందితులపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయవచ్చని చెప్పారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద దాఖలైన రెండో కేసులో సింగ్‌పై ఎలాంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆయనపై పోక్సో కేసును కొట్టివేయాలని కోరారు. కోర్టులో దాఖలు చేసిన పోలీసుల 552 పేజీల రద్దు నివేదికలో ఒక మైనర్ రెజ్లర్, ఆమె తండ్రి, ఫిర్యాదుదారు, సింగ్, ఇతర సాక్షుల వాంగ్మూలాలను ఉదహరించారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు జూలై 4న చేపట్టనుంది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 180 మందిని విచారించింది.