క్యూఆర్‌ కోడ్‌తో నకిలీలకు చెక్‌


నకిలీ విత్తనాల నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకే ప్రభుత్వ నిర్ణయం
విత్తన సంచులపై క్యూఆర్‌ కోడ్‌ తప్పనిసరి
ముద్రిస్తున్న విత్తన కంపెనీలు
ఈ వానకాలం సీజన్‌ నుంచే అమలు
నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేటా ముంచుతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తే తీరా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు మనస్తాపం చెంది మత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నకిలీ విత్తనాలకు చెక్‌ పెట్టేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నది.ఈ మేరకు విత్తన సంచులపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించాలని విత్తన కంపెనీలను ఆదేశించింది. ఈ వానకాలం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురానున్నది. అయితే, ప్రతి విత్తన సంచిపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటే ఆ విత్తనాలు మొలకెత్తకున్నా, పంట దిగుబడి రాకపోయినా గుర్తించొచ్చు. విత్తనం ఎక్కడ నుంచి వచ్చింది? నిర్ణీత కాల వ్యవధిలోనే విత్తనాలు వినియోగించారా? నాణ్యత ఎంత? తదితర పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రానుండటంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-నల్లగొండ
వ్యవసాయాభివద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. నకిలీ విత్తనాలకు చెక్‌ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ ముద్రణను తప్పనిసరి చేసింది. విత్తనాల ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను కచ్చితంగా ముద్రించాలని విత్తన కంపెనీలను ఆదేశించింది. ఈ వానకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశానుసారం కొన్ని కంపెనీలు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తూ పారదర్శకతను పాటిస్తున్నాయి. ఈ ప్రక్రియతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందనున్నాయి. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పలు కంపెనీలు విత్తనాలను ఉత్పత్తి చేస్తూ మార్కెట్‌లో విక్రయిస్తుంటాయి. ఈ తరుణంలో నకిలీ విత్తనాలు రైతులను నట్టేటా ముంచుతున్నాయి. నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తోంది. అయినా ఏదో ఒక చోట నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. క్యూఆర్‌ కోడ్‌ అమలుతో నకిలీ విత్తనాల బెడద పూర్తిగా నియంత్రణలోకి రానున్నది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలకు చెక్‌ పెడుతూ క్యూఆర్‌ కోడ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించేలా కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతాయి. పైగా నకిలీ బెడదకు చెక్‌ పడుతుంది. నకిలీ విత్తనాలను నివారించేందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేయిస్తోంది. కొందరు విత్తన వ్యాపారులు లాభాపేక్షతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఈ సమస్యను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను పూర్తిగా నియంత్రించేలా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. విత్తన ప్యాకెట్లపై కంపెనీలు ముద్రించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే విత్తనాల సమగ్ర సమాచారాన్ని రైతులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇకపై అన్ని విత్తన కంపెనీలు క్యూఆర్‌ కోడ్‌ను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రైతులకు అండగా క్యూఆర్‌ కోడ్‌..
డీలర్ల వద్ద రైతులు విత్తనాలను కొనుగోలు చేసి రసీదులు తీసుకున్నప్పటికీ ఆ విత్తనాలు మొలకెత్తకపోయినా, ఇతర సమస్యలతో రైతులు నష్టపోయినా సంబంధిత కంపెనీల నుంచి సరైన పరిహారం అందేది కాదు. విత్తన కంపెనీలు కేవలం సంచులు, ప్యాకెట్లపై ట్రూత్‌ ఫుట్‌ లేబుల్‌ అతికించి సరఫరా చేసేవి. దీంతో ఈ విత్తనాలు వంద శాతం నాణ్యమైనవిగా రైతులను నమ్మించి వ్యాపారులు సొమ్ము చేసుకునేవారు. ఇవన్నీ సమర్థనీయమైన ప్రమాణాలు కావని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం రైతులకు అండగా నిలువనుంది. ప్రతి విత్తన సంచిపైనా క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటే ఆ విత్తనాలు మొలకెత్తకున్నా, ప్రకటించిన మేర మొలకలు రాకున్నా, జన్యుపరంగా పంట దిగుబడి రాకపోయినా గుర్తించొచ్చు. విత్తనం ఎక్కడ నుంచి వచ్చింది? నిర్ణీత కాల వ్యవధిలోనే విత్తనాలు వినియోగించారా? నాణ్యత ఎంత? తదితర పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
విత్తన సంచులను భద్రపర్చాలి..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు డీలర్‌ నుంచి తగిన రసీదు తీసుకోవాలి. క్యూఆర్‌ కోడ్‌ ఉన్న సంచులను భద్రపరుచుకోవాలి. దీనివల్ల ఒకవేళ సరైన దిగుబడి రాకుండా మోసపోయినట్లయితే సదరు కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు వీలుంటుంది. క్యూఆర్‌ కోడ్‌ను వ్యవసాయాధికారులకు చూపినట్లయితే విత్తన సమగ్ర సమాచారాన్ని రైతులకు తెలియజేసేందుకు సులభంగా ఉంటుంది.
క్యూఆర్‌ కోడ్‌తో నకిలీ బెడదకు చెక్‌..
సుచరిత (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)
నకిలీ విత్తనాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతాయి. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది. విత్తన సంచులపై క్యూఆర్‌ కోడ్‌ ఉందా? లేదా? అనే విషయాన్ని రైతులు చూసుకుని కొనుగోలు చేయాలి. రైతులు విత్తన సంచులు, ప్యాకెట్లను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రభుత్వం తీసుకున్న క్యూఆర్‌ కోడ్‌ విధానం, డీలర్లు, రైతులు, విత్తన ఉత్పత్తిదారులకు రక్షణగా ఉంటుంది.

Spread the love