మోడీకి చురకలు

మోడీకి చురకలు– భిన్నత్వాన్ని అంగీకరించాలని భగవత్‌ హితవు
– విద్వేష ప్రసంగాలు విభజనకు దారితీశాయి
– ప్రత్యర్థులను విరోధులుగా చూడొద్దు
– అహంకారం లేనివాడే నిజమైన సేవకుడు
– ఆర్‌ఎస్‌ఎస్‌ను అనవసరంగా లాగుతున్నారని ఆవేదన
నాగపూర్‌ : ‘భిన్నత్వాన్ని అంగీకరించండి. కలిసి జీవించండి. ఇతరులను కూడా గౌరవించండి’….లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ చెప్పిన మాటలివి. ఎన్నికల సందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేసిన తప్పుడు ప్రచారంపై కూడా ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రజల్లో సామాజిక ఉద్రిక్తతలు, అనుమానాలకు తావిచ్చిందని చెప్పారు. ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన నొక్కి చెప్పారు.
గత నెలలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీని తాము నడపగలమని, ఆ సామర్ధ్యం తమకు ఉన్నదని ఆయన ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రికకు చెప్పారు. బీజేపీ సమర్ధత తగ్గినప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం వస్తుందని కూడా తెలిపారు. నడ్డా ప్రకటనపై భగవత్‌ రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించడంలో బీజేపీ విఫలమైన నేపథ్యంలో సోమవారం ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత చేసిన ప్రసంగం బీజేపీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి చురకలు వేసినట్లు కన్పించింది.
సమాజం ముప్పుగా పరిణమించిందని, మహిళలు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని కూడా భగవత్‌ చెప్పారు. అయితే ఆయన ప్రసంగంలో అధిక భాగం తన అనుయాయులకు హితవాక్యాలు చెబుతూనే సాగింది. ఎన్నికలు అంటే యుద్ధాలు కావని, ప్రత్యర్థులను విరోధులుగా భావించవద్దని కోరారు. ‘ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో అత్యవసరమైన ప్రక్రియ. ఇందులో ఇరు పక్షాలు ఉంటాయి. పోటీ జరుగుతుంది. అయినా దానికి గౌరవం ఉంది. అబద్ధాలు ప్రచారం చేయకూడదు. ఎన్నికైన వారు సభలో ప్రవేశించి దేశాన్ని పరిపాలిస్తారు. ఏకాభిప్రాయం ద్వారా ఆ పని చేస్తారు. పోటీ అంటే యుద్ధం కాదు’ అని చెప్పారు. ‘జరిగిన పరిణామాలను గమనించాం. ఇరు పక్షాలు నిబంధనలను బేఖాతరు చేసి పరస్పరం దాడి చేసుకోవడాన్ని చూశాం. ప్రచార వ్యూహాలను పూర్తిగా విస్మరించారు. ఇవన్నీ విభజనకు దారితీశాయి. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలను అనవసరంగా లాగుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రసంగాలు విద్వేషపూరితంగా సాగిన సంగతి తెలిసిందే. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఆయన మతపరమైన ప్రకటనలు చేశారు. వారిని చొరబాటుదారులుగా, అధిక సంతతి కలిగిన వారుగా చిత్రీకరించి కించపరిచారు. పనిలో పనిగా కాంగ్రెస్‌పై కూడా అసత్య ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీని ఉద్దేశించే భగవత్‌ పలు వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది. ‘సేవ చేసేవారు గౌరవంగా వ్యవహరించాలి.
ప్రతి వారూ పనిచేస్తారు. కానీ గౌరవంగా పనిచేయడం అవసరం. గౌతమ బుద్ధుడు చెప్పినట్లు ప్రతి వ్యక్తీ జీవనం కోసం సంపాదిస్తాడు. కానీ దానిని నైపుణ్యంతో చేయాలి. ఇతరులను పక్కకు నెట్టేయకూడదు. గౌరవంగా పనిచేయడం మన సంస్కృతి. అహంకారానికి తావివ్వకుండా పని చేసేవాడే నిజమైన సేవకుడు’ అని ఆయన అన్నారు.
మణిపూర్‌ ఘర్షణలను ప్రస్తావిస్తూ పది సంవత్సరాల పాటు ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నదని, తుపాకీ సంస్కృతి అంతరించిందని అందరూ భావించారని అంటూ ఇప్పుడు నిప్పు రాజేయాలని అనుకున్నది ఎవరని ప్రశ్నించారు. మహమ్మద్‌ ప్రవక్త, జీసస్‌ బోధనలు అనుసరణీయమని చెప్పారు. గతాన్ని మరచి పోవాలని, భయాన్ని విడనాడాలని, శక్తివంతులు గా తయారవ్వాలని భగవత్‌ హితవు పలికారు.

Spread the love