చెన్నైని ముంచెత్తిన వర్షం

నవతెలంగాణ – చెన్నై: నగరంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత పెనుగాలులతో ఉగ్రరూపం దాల్చింది. సోమవారం వేకువజాము వరకూ కురిసిన కుండపోతకు నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పెనుగాలుల వల్ల పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. 73 యేళ్ల తర్వాత జూన్‌లో మూడింతల వర్షపాతం నమోదైనట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారి బాలచంద్రన్‌ తెలిపారు. మీనంబాక్కంలో 16 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ భారీ వర్షానికి పెరంబూరు, పుళియంతోపు, కత్తిపారా, ఓఎంఆర్‌, తిరుమంగళం, తరమణి తదితర ప్రాంతాల్లోని రహదారులు పొంగి పొర్లాయి. అడయార్‌ గ్రీన్‌వేస్ రోడ్డు కూడలి, నీలాంగరై ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పెరుంగుడి ప్రపంచ వాణిజ్య కేంద్రం సమీపంలో నాలుగు అడుగుల మేర ఏరులా ప్రవహించింది. వర్షపునీరు ప్రవహించడంతో వాహనాలన్నీ నత్తనడక నడిచాయి. దీంతో విద్యార్థులు స్కూళ్లకు, ఉద్యోగులు కార్యాలయాలకు, కార్మికులకు కర్మాగారాలకు సకాలంలో చేరుకోలేక పోయారు. కొన్ని చోట్ల పెనుగాలులకు చెట్లు కూలిపడటం వల్ల కూడా ట్రాఫిక్‌ స్తంభించింది. చెన్నైలో 207 ప్రాంతాల్లో అడుగులోతుకు మించి వర్షపు నీరు ప్రవహించినట్టు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. 163 ప్రాంతాల్లో ముమ్మరంగా వాననీటి తొలగింపు పనులు చేపట్టారు. చెట్లు కూలిన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి రంపాలతో కొసి తొలగించారు. మైలాపూరు ముండగకన్నియమ్మన్‌ ఆలయ వీధి, టి.నగర్‌, అడయార్‌ గాంధీనగనర్‌లోని ఆదిత్తనార్‌ రహదారుల్లో చెట్లు కూలాయి. సబర్బన్‌ ప్రాంతాలైన తాంబరం, మధురవాయల్‌, రెడ్‌హిల్స్‌, మాధవరంలోనూ భారీగా వర్షం కురిసింది.

Spread the love