చెన్నై పాంచ్‌ పటాకా

– ఐపీఎల్‌ 16 టైటిల్‌ సూపర్‌కింగ్స్‌ సొంతం
– ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ పై ఉత్కంఠ విజయం
– డిఫెండింగ్‌ చాంపియన్‌కు తప్పని ఓటమి
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐదేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి ఐపీఎల్‌లో ఐదో ట్రోఫీ (2010, 2011, 2018, 2021, 2023) సొంతం చేసుకుంది. వర్షం కారణంగా 15 ఒవర్లలో 171 పరుగులకు కుదించిన లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (47, 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (26, 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శివం దూబె (32 నాటౌట్‌, 21 బంతుల్లో 2 సిక్స్‌లు), అజింక్య రహానె (27, 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (19, 8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) సమిష్టిగా రాణించటంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ టైటిల్‌ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించింది. చివరి రెండు బంతులకు పది పరుగులు అవసరం కాగా.. రవీంద్ర జడేజా వరుసగా 6, 4 బాది సూపర్‌కింగ్స్‌కు సంచలన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (96, 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్‌ వృద్దిమాన్‌ సాహా (54, 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో రాణించాడు.
ఆద్యంతం ఉత్కంఠ
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి చెన్నై 0.3 ఓవర్లలో 4/0తో ఉండగా వర్షం ఆటంకం కలిగించింది. అర్థరాత్రి 12.10 గంటలకు ఆట ఆరంభం కాగా చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు. పది వికెట్లు చేతిలో ఉండటంతో చెన్నై ఎదురుదాడి చేసింది. ఓపెనర్లు కాన్వే, రుతురాజ్‌ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. రహానె, దూబె కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సరైన సమయంలో సిక్సర్లు సంధించి సాధించాల్సిన రన్‌రేట్‌ను అందుబాటులో ఉంచారు. అంబటి రాయుడు (19) మోహిత్‌ శర్మ ఓవర్లో వరుసగా 6, 4,6 బాదటంతో మ్యాచ్‌ చెన్నై వశమైందనిపించింది!. కానీ ఆ తర్వాత వరుస బంతుల్లో రాయుడు, ధోని (0) నిష్క్రమణతో టైటాన్స్‌ రేసులోకి వచ్చింది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. నాలుగు బంతుల్లో మోహిత్‌ శర్మ 3 పరుగులే ఇచ్చాడు. చివరి రెండు బంతులను సిక్సర్‌, ఫోర్‌గా మలిచిన రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ అందించాడు. టైటాన్స్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (2/17), మోహిత్‌ శర్మ (3/36) రాణించారు.
సుదర్శన్‌ మెరుపుల్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. చెన్నై ఫీల్డింగ్‌ తప్పిదాలను టైటాన్స్‌ గొప్పగా సద్వినియోగం చేసుకుంది. ఓపెనర్లు సాహా (54), గిల్‌ (39) శుభారంభం అందించారు. సాయి సుదర్శన్‌ (96) తుది పోరులో అదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లతో 47 బంతుల్లోనే 96 పరుగులు పిండుకున్నాడు. 33 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన సాయి సుదర్శన్‌.. డెత్‌ ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ పాండ్య (21 నాటౌట్‌) సైతం ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
గుజరాత్‌ టైటాన్స్‌ : 214/4 (సుదర్శన్‌ 96, వృద్దిమాన్‌ 54, గిల్‌ 39, పతిరణ 2/44)
చెన్నై సూపర్‌కింగ్స్‌ : 171/5 (కాన్వే 47, దూబె 32, రహానె 27, జడేజా 15, నూర్‌ అహ్మద్‌ 2/17)

Spread the love