ఉన్నతంగా వైద్యం అదే మా లక్ష్యం : సీఎం కేసీఆర్‌

 నిమ్స్‌లో దశాబ్ది బ్లాక్‌ భవనానికి శంకుస్థాపన
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ ప్రారంభం

2014 లో వైద్యరంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు రూ.2,100 కోట్లు. కాగా, 2023-24లో కేటాయింపులు రూ. 12,367 కోట్లకి పెంచార. అన్నం ఉడికిందా అని కుండంతా పిసికి చూడాల్సిన అవసరం లేదు. దీన్నే బట్టే మనకు తెలంగాణ పురోగమనం అర్థం అవుతుంది. వైద్యారోగ్య శాఖను చాలా అనూహ్యంగా విస్తరిస్తున్నాం. 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు విస్తరించాం, వందో రెండొందలో ఉన్న ఆక్సిజన్‌ బెడ్లను 50 వేలకు పెంచుకున్నాం, కేంద్రాన్ని ప్రాధేయపడకుండా సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాం – కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంత వరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల తపన కొనసాగుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనీ, కరోనావంటి కష్టకాలంలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, ఉన్నతాధికారులు ప్రదర్శించిన పనితీరు గొప్పదని సీఎం కొనియాడారు. ఎంతచేసినా వైద్యశాఖకు పలు దిక్కుల నుంచి విమర్శలు వస్తుంటాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ప్రజావైద్యం దిశగా ఈ శాఖ చేస్తున్న కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. అందుకోసం ప్రజా సంబంధాల వ్యవస్థను మరింతగా మెరుగుపరుచుకుని ప్రణాళిక రూపొం దించుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు జరిగిన వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా …ప్రముఖ ప్రభుత్వ దవాఖాన నిమ్స్‌ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే ఈ ‘దశాబ్ధి వైద్య భవనాల్లో’ నూతనంగా 2,000 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి రానున్నాయి. అత్యంత అధునాతన ఆపరేషన్‌ థియేటర్లు సహా వర్తమాన వైద్య రంగంలో ప్రజల వైద్యసేవలకు అవసరమయ్యే పలు రకాల వైద్య సేవలు అందనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ మానవ జీవితానికి, వైద్యానికి ఉన్న ఎడతెగని సంబంధాన్ని వివరించారు. ”మానవజీవితం ఉన్నంత కాలం వైద్యం కూడా తప్పకుండా కొనసాగుతూనే ఉంటుం దని తెలిపారు. గతంలో మిడతలదండు బెడద గురించి కేంద్రం హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం తీసు కున్న చర్యలు, అనుభవాలను కేసీఆర్‌ వివరించారు. ” మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ మీదుగా గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రానికి మిడతల దండు వస్తుంటుంది. ఈ మిడతల దండు హర్యానా లోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర లోకి ప్రవేశించి, ఆదిలాబాద్‌ సరిహద్దు దాకా విస్తరి స్తూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో ఆది లాబాద్‌ ఉత్తర భాగాన ఉన్న కలెక్టర్లను, ఎస్పీలను అప్రమత్తం చేసి ప్రజలను, పంటలను కాపాడుకునేం దుకు ఫైరింజన్లు, స్ప్రేలతో సన్నద్ధంగా ఉన్నాం. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక మహిళా అధికారి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాల యం నుంచి ఇద్దరు ఎంటమాలజిస్టులు పర్యవేక్షణ కోసం వస్తే హెలికాప్టర్‌ సమకూర్చి సరిహద్దులకు పంపాం. మహారాష్ట్రలోనే మిడతల దండును చంపే యడం వల్ల, అవి మన దాకా రాలేదు. సైన్స్‌ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు కనుక్కో లేదని నేను వారిని ప్రశ్నించాను. అందుకు వారు, మిడతలను చంప లేము. నిర్మూలించలేము. అది అసాధ్యమని చెప్పా రు. మనిషి 4 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చాడు. కానీ ఈ మిడతలు, బాక్టీరియాలు, ఇతరత్రా 8 లక్షల సంవత్సరాల క్రితమే ఉద్భవిం చాయి. అవి నిద్రాణంగా ఉంటాయి. వాటికి వ్యతిరేక చర్యలతో ప్రకోపం చెంది ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పారు. కరోనా కూడా అటువంటిదేనా అంటే అటువంటిదే అని వారు బదులిచ్చారు. అయితే ప్రజలను ఎలా రక్షించుకోవాలని ప్రశ్నించాను. ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పకడ్బందీగా ఉంటుందో అక్కడ తక్కువ నష్టాలు జరుగుతాయని వారిచ్చిన సమాధానంతో ఆరోగ్యశాఖ ప్రాధాన్యతను అర్థం చేసుకున్నాను..” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వివరించారు.
” డాక్టర్లు గొప్పవారు. నిరుపేదలు వైద్యానికి వచ్చిన సందర్భంలో బెడ్లు అందుబాటులో లేకుంటే కిందనే బెడ్డు వేసి వైద్యం అందిస్తారు. దాన్ని రోగుల ను కింద పడుకోబెడుతున్నారు… అంటూ పత్రికలు, జర్నలిస్టులు వక్రీకరణలు చేస్తారు. వైద్యారోగ్యశాఖ అధికారులకు పౌర సంబంధాలపై అవగాహన తక్కువ. దీంతో వారిని విమర్శించే వారే ఎక్కువ. వైద్యం ప్రత్యేక చదువు, అర్హత. మానవతా కోణంలో ఆలోచించాలి. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా డాక్టర్ల దగ్గరికి రావాల్సిందే…” అని సీఎం తెలిపారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు చురుకైన వ్యక్తి అంటూ సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు.” వైద్యశాఖ అందించే సేవలు ప్రజల్లోకి పోయేలా పౌర సంబంధాలను పెంపొందించాలి. ప్రజలతో పెన వేసుకున్న విభాగం కాబట్టి వైద్యారోగ్య రంగంలో పౌరసంబంధాలు బాగా పెరగాలి. వైద్యారోగ్య శాఖ ప్రజల బాగు కోసం ఏం చేస్తున్నదనేది ప్రజలకు బాగా తెలిసేలా చర్యలు చేపట్టాలి.
కేసీఆర్‌ కిట్ల ద్వారా గర్భిణులకు నగదు సాయంతో పాటు, ప్రసవానంతరం ఇచ్చే కిట్లతో ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ప్రస్తుతం అవి 70 శాతానికి పెరిగాయి. తద్వారా మహిళల ఆరోగ్యం బాగుంటు న్నది. అనవసరమైన అబార్షన్లు, దుర్మార్గపూరిత చర్య లు కూడా ఉండటం లేదు. సమాజాన్ని కాపాడు కోగలుగుతున్నాం. మాతా మరణాలు, శిశు మరణా లు చాలా తగ్గాయి…” అని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి నిమ్స్‌లో 900 పడకలుంటే వాటిని 1,500 పెంచుకున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వాటికి తోడు మరో రెండు వేల పడకల ఆస్పత్రి బ్లాక్‌ నిర్మించుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నాలుగువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రు ల నిర్మాణం, విదేశాలకు పోకుండా ఆధునిక వైద్య సేవలు, టెలిమెడిసిన్‌ వంటివి విస్తరించామని గుర్తుచేశారు.
కరోనా వంటి పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రయివేటు ఆస్పత్రులు తిరస్కరించిన కరోనా రోగులను గాంధీ ఆస్పత్రి వైద్యులు బతికించారని అభినందించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అను గుణంగా అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిం చాలని వైద్యులకు సూచించారు.
న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
గర్భిణీలకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్ర మాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ లబ్ధిదారు లు ఉదయనగర్‌ కాలనీకి చెందిన పార్వతి, భోళా నగర్‌కు చెందిన పర్వీనమ్మ, ఎంబీటీనగర్‌కు చెందిన శిరీషమ్మ, ప్రతాప్‌నగర్‌ పంజాగుట్ట తేజశ్విని, శ్రీరామ్‌ నగర్‌కు చెందిన సుజాతమ్మ, అంబే ద్కర్‌ నగర్‌ రేణుక మ్మలకు న్యూట్రి షన్‌ కిట్లను సీఎం అందచేశారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు లక్ష్మినరసింహ స్వామి జ్జాపికను అందచేశారు. ఈ కార్య క్రమంలో వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్‌ రావు, మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచండి
 ఇతరత్రా సమస్యలు పరిష్కరించండి
 సీఎం కేసీఆర్‌కు సీఐటీయూ వినతి పత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల జీతాలను పెంచాలనీ, ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌( సీఐటీయూ) వినతిపత్రం అందజేసింది. బుధవారం నిమ్స్‌ ప్రాంగణం లో సీఎం కేసీఆర్‌ను సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కేవీ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్‌, కనీస వేతనాల సలహా మండలి బోర్డు చైర్మెన్‌ పి.నారాయణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, నిమ్స్‌ కాంట్రాక్టు కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) అధ్యక్షులు ఎం.వెంకటేశ్‌, నాయకులు బాలయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో 30 ఏండ్ల నుంచి 1350 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, 306 డ్రాప్ట్‌ జీవో ప్రకారం రూ.14,700 జీతం మాత్రమే ఇస్తున్నారని సీఎం కేసీఆర్‌ దృష్టికి వారు తీసుకెళ్లారు. 2019 నుంచి వీడీఏ పాయింట్లు అమలు చేస్తామనీ, వాటి ని లెక్కించి అదనంగా రూ.2,100 వేతనం పెంచి ఏరి యర్స్‌ ఇస్తామని నిమ్స్‌ అధికారులు వాగ్దానం చేసిన విష యాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకూ నిమ్స్‌ యాజమా న్యం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వాపో యారు. సీనియార్టీ ప్రకారం కార్మికులను రెగ్యులర్‌ చేయా లనీ, 306 జీవోను గెజిట్‌ చేయాలనీ, రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. నిమ్స్‌లో పని చేసి రిటై ర్డ్‌ అయిన కార్మికులకు ఆ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలం దించాలనీ, బస్‌పాసు సౌకర్యం కల్పించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు సీఎం కేసీఆర్‌ హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం
రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలకు
అంతర్జాతీయ అవార్డులు చేశారు. ఇందులో…. డా.బిఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జీ, మొజంజాహీ మార్కెట్‌లు ‘ఇంటర్నేషనల్‌ బ్యూటీఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డుల’ను అందుకోవడం గొప్ప విషయమని సీఎం తెలిపారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్‌ ఆర్గనైజేషన్‌’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్‌ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఇనుమడించిందని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్దరణ జరుగుతున్నదని సీఎం స్పష్టం చేశారు. అందుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16న లండన్‌లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి అందచేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం కేసీఆర్‌ అభినందించారు.

 

Spread the love