గురువుల కోసం పిల్లల ఎదురుచూపు

– సమయానికి పాఠశాలలకు ఉపాధ్యాయులు రాకపోవడం తో విద్యార్థుల పడిగాపులు….
నవతెలంగాణ – చివ్వేంల
సమాజంలో తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. ఒక విద్యార్థి భావితరాలకు మార్గ నిర్దేశకులు గా నిలబడాలంటే ఉపాధ్యాయులు లేనిది ఏదీ సాధ్యం కాదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల తండాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పంతుల పరిస్థితి అధ్వానంగా మారిందని పలువురు విమర్శిస్తూ ఉన్నారు. విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్లకే క్రమశిక్షణ లేకపోతే! పాఠాలు చెప్పడం సంగతి అటుంచితే.. సమయానికి పాఠశాలలకు రాక పోవడం తో, పాఠశాల ముందే విద్యార్థులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు చదువుల కోసం పాఠశాలకు వెళ్తున్నా ఉపాధ్యాయులు మాత్రం సమయానికి రారు, విద్యాబోధన చేయరు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా రావడం పోవడం మామూలైపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వల్లభపురం  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు పాఠశాలకు ఇష్టానుసారంగా రావడంతో పిల్లలకు విద్యాబోధన సక్రమంగా జరగడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడమే జరుగుతుందని అక్కడ విద్యాబోధన జరగడం లేదని వారు విమర్శిస్తున్నారు. చిన్న పిల్లలకు తొలిమెట్టులో విద్యాబోధన సక్రమంగా అందకపోవడంతో, నష్టపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి .ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఉదయం 8-00గంటల నుంచి 12-30నిమిషాల వరకు పాఠశాలలు నిర్వహించాలి.. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఉపాధ్యాయులు తమకు యిష్టం వచ్చినట్లు తూతూ మంత్రం గా పాఠశాలలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెళువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు   పిల్లలను  పంపిస్తే కొంతమంది  పంతులు పాఠాలు చెప్పకపోవడంతో పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని, అప్పు చేసి మరి   ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నామని   కొంతమంది పిల్లలతల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శనివారం  సమయం 8:22 నిమిషాలకు కూడా ఉపాధ్యాయులు రాకపోవడంతో బడి తాళాలు కూడా తియ్యకపోవడం తో  విద్యార్థులు పాఠశాల బయట ఉన్నారు ..  ఉపాధ్యాయులు  సమయానికి విధులకు రాకపోవడంతో  విద్యార్థులకు విద్యాబోధన చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం  ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఒంటి పూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు వరకు నిర్వహించాలని పేర్కొంది. మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం ఇళ్లకు పంపించాలని పేర్కొంది. ఉదయం 8-00గంటలకు రావలసిన ఉపాధ్యాయుడు  ఉదయం 8-24నిముషాలకు పాఠశాలకు  రావడం విశేషం..వల్లభపురం పాఠశాలలో 16మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్లు సమాచారం… 8-24 నిముషాలకు పాఠశాలకు ఉపాధ్యాయుడు  వచ్చి తాళం తీయడం ప్రభుత్వం నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తున్నారో అర్థమవుతుంది ..ఇంకొకరు సెలవు పెట్టారా లేదా అనే సమాచారం తెలియాల్సిఉంది.. కష్టపడితే గాని పూట గడవని కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారని, వేల రూపాయలు ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు కట్టలేక,  తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలని కోరికతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తుంటే వారి భవిష్యత్తును  తీర్చిదిద్దాల్సిన గురువులేమో పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లల భవిష్యత్ అంధకారమయంగా తయారవుతుందేమొననే ఆందోళన చెందుతున్నారు.  పిల్లల తల్లిదండ్రుల్లో ఉన్న అపనమ్మకాన్ని  తొలగించే విధంగా  ప్రభుత్వం పాఠశాలలను ప్రక్షాళన చేసే విధంగా, సంబంధిత జిల్లా  విద్యాధికారులు స్పందించి, మండలంలోని పాఠశాలపై ప్రత్యేక చొరవ తీసుకొని, సమయ వేళలో ఉపాధ్యాయులు వచ్చే విధంగా విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన చేసేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరారు.
Spread the love