‘బాలల మిత్రుడు’… మణిపూసల కవివ్రతుడు ‘వడిచర్ల సత్యం’

‘శ్రీపద’ కలం పేరుతో రచనలు చేస్తున్న కవి, వ్యాసకర్త, ఉపాధ్యాయుడు, బాల సాహిత్యకారుడు, మణిపూసలు రూపకర్త వడిచర్ల సత్యం. నిజానికి సత్యం ఇంటి పేరు కుర్వ, కానీ తాను పుట్టి పెరిగిన ఊరు ‘వడిచర్ల’ను తన యింటిపేరుగా పెట్టుకుని తనకు జన్మనిచ్చిన మట్టికి గౌరవాన్ని యిచ్చిన కవి. 8 ఏప్రిల్‌, 1973న వికారాబాద్‌ జిల్లాలోని బొమ్మరాసుపేట మండలం ‘వడిచర్ల’కు చెందిన సత్యం తల్లితండ్రులు శ్రీమతి కుర్వ లక్ష్మమ్మ, తండ్రి మాసయ్య.
పద్యం, గేయం, వచనంతో పాటు తాను లక్ష్యలక్షణాలు ఏర్పాటు చేసుకుని రూపొందిం చుకున్న ‘మణిపూసలు’ కవితా రూపం మొదలుకుని బాల సాహిత్యం వరకు డజనుకు పైగా పుస్తకాలు రాశాడు సత్యం. ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్వ్తం సత్యం లక్షణం, అది ఆయనలోనూ… ఆయన కవిత్వంలోనూ కనిపిస్తుంది. సత్యం రచనలో మాతృభాష గురించి ఎంత తండ్లాట మనకు కనిపిస్తుందో అంతే తండ్లాట దేశం, ధర్మం, దేశభక్తి, ప్రగతి, వివిధ ఉద్యమాలు ఈయన కవిత్వంలో చూడవచ్చు. అందుకు ఆయన రాసిన ‘అగ్నికణం’, ‘తెలంగాణ ఉయ్యాల’, ‘తెలంగాణ పోరుకేక’, ‘చెరువు నవ్వింది’, ‘కె.సి.ఆర్‌. శతకం’ ‘వడిచర్ల మణిపూసలు’ వంటి రచనలు నిదర్శనం. కార్యకర్తగా, సాహిత్య సంస్థ నిర్వాహకుడిగా తాండూర్‌ కేంద్రంగా ఈయన స్థాపించిన ‘కాగ్నా కళా సమితి’ ద్వారా దాదాపు పుష్కర కాలంగా వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పనచేసి నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయుడుగా పిల్లలతో రచనలు చేయించి వాటిని అచ్చులోకి తెచ్చే గురుతర బాధ్యతను అత్యంత బాధ్యతగా నిర్వహించాడు. అంతేకాదు సత్యం ప్రాథమిక పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాల్గొన్నాడు. 2011లో రంగారెడ్డి బిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2018లో వికారాబాద్‌ జిల్లా తెలంగాణ ఆవిర్భావ పురస్కారంతో పాటు వివిధ సంస్థల నుండి పలు పురస్కారాలు పొందాడు.
బాల వికాస కార్యకర్తగా బాలలతో ఎన్ని రచనలు చేయించాడో, బాల సాహితీవేత్తగా కూడా చక్కని రచనలు చేశాడు వడిచర్ల సత్యం. బాలల కోసం సత్యం చేసిన రచనల్లో ‘అక్షరాలతో ఆడుకుందాం’, ‘విప్పిచెప్పు బాల’, ‘జాబిలమ్మ పదాలు’, ‘తెలుగు శతకం’, ‘తెలంగాణ పదాలు’, ‘ఇదేనోరు దేశభక్తి’ వంటివి ఉన్నాయి. మణిపూసలతోపాటు బాలల కోసం చక్కని గేయాలను రాశారు సత్యం. అక్షరాలతో ఆడుకుందాం ఒక రకంగా పిల్లల కోసం కూర్చిన సరళవాచకం. చదవడంలో వెనుకబడిన పిల్లలకు కానుకగా బాలల నేస్తం అందించిన కానుక యిది. ఇందులో సరళ పదాలు, ప్రాస పదాలు, జోడు పదాలు, మాటలమెట్లు, పేరడీల వంటి వాటితో గేయాలు ఉన్నాయి. ‘బాలలం బాలలం/ బడికి వెళ్ళే బాలలం/ చదువులమ్మ వొడిలోన/ చదువుకునే పిల్లలం/ …. కులమతాలు కూల్చివేసి/ కూరిమి నెద నింపుతాం/ క్రమశిక్షణ పాటించి/ కలిసిమెలిసి బ్రతుకుదాం/ పచ్చదనం పరిశుభ్రత/ లక్ష్యాలుగ కదులుతాం/ అమ్మానాన్న గురువులకు/ ఆనందం పంచుతాం’ అంటూ సాగే చక్కని గేయం ఈ పుస్తకంలో చదవొచ్చు. ‘విప్పిచెప్పు బాల’ పేరు చూడడంతోనే ఇందులో ఏముందో తెలుస్తుంది. అవును యిది పొడుపు కథల వయ్యి. అయితే… పిల్లల్లో జిజ్ఞాసను, ఆలోచనను, ఆసక్తిని పెంచడంలో శతకం చక్కగా తోడ్పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్‌ విద్యామిషన్‌ దీనిని 2008లో ప్రచురించింది. ‘సారలున్న నదియు సారంగియు కాదు/ తోకయున్న నదియు తొండ కాదు/ చెట్లమీదనున్న కట్లపామది కాదు/ విప్పి చెప్పుబాల వినయశీల’ (ఉడుత), కదలి నడువలేవు కాళ్ళు గలిగియున్న/ చేయలేవు పనులు చేతులున్న/ మాటలాడలేవు మనుజులవలెనున్న’ (బొమ్మలు), ఇటువంటిదే మరో పొడుపు పద్యం ‘వేటలాడ గలడు వేటకాడా? కాదు/ వనములోనున్న మునియు కాడు/ రాజు పేరు గలదు రాజ్యంబులేలడు’ (సింహం).
ఆరుద్ర కూనలమ్మ పదాలకోవలో బాలల కోసం అలతిఅలతి పదాలతో తెచ్చిన రచన ‘జాబిలమ్మ పదాలు’. పిల్లల లేత మనసుకు హత్తుకునేలా అంత్యానుప్రాసలతో సాగిన దాదాపు మూడు వందల పదాలు యిందులో ఉన్నాయి. ‘మాతృభాషకు ఖ్యాతి/ కలిగినప్పుడు జాతి/ జీవనానికి ప్రగతి/ ఓ జాబిలమ్మ’, ‘గురువు చెప్పిన మాట/ ఫలములయ్యెడి తోట/ మరచిపోకే పూట/ ఓ జాబిలమ్మ’, ‘పదిమందిలో మీరు/ మాటలాడెటి తీరు/ తెచ్చిపెట్టును పేరు/ ఓ జాబిలమ్మ’ వంటి అనేక సామాజిక, మానవీయ, నైతిక అంశాలపై ఈ పదాలు చెప్పాడు సత్యం. ‘తెలుగు శతకం’ 111 మంది తెలుగు కవులను ‘తెలిసి చదువుబాల! తెలుగులీల’ మకుంటంతో ఇందులో పిల్లలకు పరిచయం చేశాడు సత్యం. ‘తెలంగాణ పదాలు’ తెలంగాణ నేలపై బాలలకే భక్తిభావంతో పాటు ప్రేమను పెంచేందుకు కూర్చాడు కవి. ‘జై!జై! తెలంగాణ/ జయహో తెలంగాణ/ జగమునూపిన వీణ/ నా తెలంగాణ’ మచ్చుకు ఒకటి. ‘ఇదేనోరు దేశభక్తి’ బాలల కోసం తెచ్చిన ‘మణిపూసలు’, ‘తరువును రక్షించడం/ చెరువును కాపాడడం/ ఇదేనోరు దేశభక్తి/ సత్యం వచియించడం’ అంటూ దేశభక్తిని కొత్తగా నిర్వచించిన సత్యం, సత్యంను అనుసరించిన వందకు పైగా కవులు, బాలల మణిపూసలు రాసి బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం విశేషం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548 

Spread the love