– గాజాలో ప్రతిరోజూ సగటున 400 మంది మృతి:: యూనిసెఫ్
జెనీవా : చిన్నారులు, మహిళలు లక్ష్యంగా ఇజ్రాయిల్ జరుపుతున్న అమానవీయ దాడులపై ఐరాస చిన్నారుల విభాగం (యూనిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. అక్టోబర్ 7 యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 3,500 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు తెలిపింది. గాజా చిన్నారుల ‘శ్మశాన వాటిక’గా మారిందని యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజా స్ట్రిప్‌పై కనికరంలేని ఇజ్రాయిల్ బాంబుదాడుల్లో సుమారు 3,542 మంది చిన్నారులు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. డజన్ల నుండి వందలాది, వేలాది మంది చిన్నారులు దాడుల్లో మరణించడం ఆవేదన కలిగిస్తోందని, రోజుకి సగటున 400కు పైగా చిన్నారులు మరణిస్తున్నారని అన్నారు.
ఇజ్రాయిల్ తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని పునరుద్ఘాటించారు. అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా మానవతా సాయం అనుమతించేలా అన్ని సరిహద్దులను వెంటనే తెరవాలని అన్నారు. కాల్పుల విరమణ ప్రకటించకపోతే చిన్నారులు తీవ్రమైన నీటి, మందుల కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తే సుమారు వెయ్యిమంది చిన్నారులను రక్షించినట్లేనని ఎల్డర్ తెలిపారు. ఆహారం, నీరు, ఇంధనం, మందులతో పాటు ఇతర మానవతా సాయాన్ని వారికి అందించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
గాజాలో చిన్నారులు బాంబులు, మోర్టార్ల కన్నా డీహైడ్రేషన్‌తో మరణించే ముప్పు ఉందని హెచ్చరించారు. చాలా మంది పిల్లలు ఉప్పునీరు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని, సాధారణంగా లభించే మంచినీటిలో కేవలం 5 శాతం మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. చాలావరకు సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు ధ్వంసం కాగా, మరికొన్ని ఇంధనం లేక మూతపడ్డాయని అన్నారు.
గాజాలో మూడు వంతులకు పైగాచిన్నారులు గాయాలతో, ఎదుర్కొన్న దాడులతో మానసిక ఆందోళనకు గురయ్యారని అన్నారు. ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య యుద్ధం ముగిసే నాటికి కొన్ని తరాల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ వెంటనే కాల్పుల విమరణను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.