– 21 ఏండ్లకే పోటీ చేస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాలల మాక్ అసెంబ్లీ స్ఫూర్తిదాయకమనిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందులో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. జవహర్‌లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీలో విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని అన్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. 18 ఏండ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీదేనని అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయోపరిమితి 25 ఏండ్లు నిండి ఉండాలనే నిబంధన ఉందన్నారు. 21 ఏండ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశముంటుందని వివరించారు. బాలల మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్లులను ఆమోదించడం అభినందనీయమని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు… ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. విపక్షాలు ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం వారి బాధ్యత అని చెప్పారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలుంటాయని వివరించారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని అన్నారు.
కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రు విద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ ఆర్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.