చలివాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు గండి

చలివాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు గండి, గండి ద్వారా చలివాగులోకి మళ్లీన నీరు, స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించిన రైతులు, అధికారులకు సమాచారం అందించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, గండిపడిన అధికారుల పర్యవేక్షణ కరువు, చలివాగు మత్తడి షట్టర్ మూసి వేసి నీటిని నిలుపుదల, గండిని పూడ్చి ఆయకట్టుకు నీరు అందించాలని రైతుల వేడుకలు      
నవతెలంగాణ –  శాయంపేట: మండలంలోని జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు శనివారం రాత్రి గండి పడింది. గండి ద్వారా నీరు చలివాగులోకి వెళ్లాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సమాచారం ఇవ్వగా, చలివాగు తూము షట్టర్ మూసి వేయించి నీటిని నిలుపుదల చేయించారు. వివరాల్లోకి వెళితే… చలివాగు ప్రాజెక్టు ద్వారా అధికారికంగా 3067 ఎకరాలకు  సాగునీరు అందుతుండగా, మరో రెండు వేల ఎకరాలకు అనధికారికంగా సాగునీరు అందిస్తుంది. చలివాగు ప్రధాన కాలువ ద్వారా శాయంపేట, పరకాల, రేగొండ మండలాలకు సాగునీరు అందుతుంది. కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పక్కనే ప్రధాన కాలువకు గత ఏడాది గండిపడగా, అధికారులు తాత్కాలిక మరమ్మత్తు పనులు చేసినట్లు ఎంపిటిసి మేకల శ్రీనివాస్ తెలిపారు. కాల్వ కొద్దిగా కుంగిపోవడంతో నీటిని తక్కువగా సరఫరా చేస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీరడీలు కాలువలో సమృద్ధిగా నీరు విడుదల చేయడంతో గత నెల నుండి చిన్న చిన్నగా నీరు పోతుందని రైతులు తెలుపుతున్నారు. శనివారం రాత్రి ప్రధాన కాలువకు గండి పడటంతో నీరంతా మరలా చలివాగులోకి మళ్ళాయి. ఈ విషయాన్ని రైతులు స్థానిక సర్పంచ్ గోలి మాధురి మహేందర్ రెడ్డి, ఎంపిటిసి మేకల శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన స్థానిక ప్రజాప్రతినిధులు దేవాదుల డిఈ గిరి, ఏఈ అమృత్ ల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఫోన్లో నీరడీతో మాట్లాడి ఆదివారం ఉదయమే చలివాగు తూము షట్టరు నీటి సరఫరా జరగకుండా మూసి వేయించారు. చలివాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండిపడి నీరు పోయినప్పటికీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. *మరమ్మత్తు పనులు చేపట్టాలి* చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద వరి పంట పొట్టదశకు చేరుకుందని, మరో రెండు తడులు తడిపితే పంట చేతికి వచ్చే పరిస్థితి నెలకొందని, ప్రధాన కాలువ గండిని వెంటనే మరమ్మతు చేపట్టి ఆయకట్టుకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ గోలి మాధురి మహేందర్ రెడ్డి, ఎంపిటిసి మేకల శ్రీనివాస్ అధికారులను కోరారు. పంటలకు సాగునీరు అందకపోతే 10 శాతం మాత్రమే దిగుబడి వస్తుందని, 90 శాతం పంట నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రధాన కాలువ గండిని పూడ్చివేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

Spread the love