ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతుల ఆందోళన

In the elephant market Chilli Farmers Concern– వ్యాపారులకు కొమ్ముకాస్తున్న అధికారులు
– మార్కెట్‌ కార్యాలయం ముందు ధర్నా
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఉదయం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ధరలు అమాంతం తగ్గించి వేశారని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని మార్కెట్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఉదయం ఎప్పటిలాగే జెండా పాట నిర్వహించారు. ఈ పాటలో మిర్చి రేటు రూ.20,100 పలికింది. రోజురోజుకు మిర్చి ధర తగ్గుతున్నప్పటికీ రైతులు అమ్ముకోక తప్పడం లేదు. జెండా పాటను అనుసరించి మిగతా సరుకులు రూ.18 వేల నుంచి 20వేల మధ్య రేటు ఉంటుందని రైతులు భావించారు. కానీ వ్యాపారులు మిగతా సరుకు కేవలం రూ.12 వేల నుంచి 13వేలుగా ధర నిర్ణయించడంతో మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మార్కెట్‌ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గించారని ఆరోపించారు. ఎరువులు, కూలీలు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయాయని.. ఈ క్రమంలో కనీసం మద్దతు ధర రాకుండా తాము పంటలను వేసి ఉపయోగం ఎంటని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వాణిజ్య పంటలు వేసి బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు. జెండా పాటను అనుసరించి వాస్తవ ధర నిర్ణయించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. వ్యాపారులకు, మార్కెట్‌ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రసాద్‌ రావు, మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంగయ్య, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ, మామునూరు ఏసీపీ రైతులతో చర్చలు జరిపారు. తక్కువ ధర పలికిన సరుకును మరోసారి పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాంతో మధ్యాహ్నం కాంటాలు యధావిధిగా కొనసాగించారు. a

Spread the love