చైనా ఎన్నటికీ సోషలిజాన్ని వీడదు…

– ప్రజలే మొదటి ప్రాధన్యతగా చైనా ఆధునీకరణ
– ప్రపంచ రాజకీయ పార్టీల సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌
– సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 530 పార్టీలు
న్యూఢిల్లీ : చైనా ఎన్నటికీ సోషలిస్టు విధానాన్ని విడనాడదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. బుధవారం చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ఆధ్వర్యంలో ”ప్రపంచ రాజకీయ పార్టీలు-ఆధునికీకరణ మార్గాలు” అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 530 పార్టీలు పాల్గొనగా జీ జిన్‌పింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రజలకు మొదటి ప్రాధన్యత ఇచ్చే ఆధునీకరణ విధానాన్ని మాత్రమే చైనా అనుసరిస్తుందని అన్నారు. సోషలిస్టు విధానాన్ని తాము ఎన్నటికీ విడనాడమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపేందుకు కుట్రలు చేయడం ప్రజాస్వామ్యమే కాదని స్పష్టం చేశారు. వలసవాదాన్ని, అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న ఆధిపత్య విధానాన్ని చైనా ఎప్పటికీ అనుసరించదని పేర్కొన్నారు. చైనా తన చేతనైనంత వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపుతోందని, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల (ఉత్తర, దక్షిణ దేశాలు) మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. ఈ దిశగా చైనా ప్రపంచ నాగరికతల పట్ల సరికొత్త చొరవ తీసుకుంటుందని జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఏ దేశానికి ఆదేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, ఆ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆధునీకరణ విధానాన్ని అవలంభించాలని సూచించారు. అంతేతప్ప ప్రపంచమంతా ఒకే విధంగా ఆధునీకరించబడాలనే విధానాలను రుద్దే ప్రయత్నాలు సరైనవి కావన్నారు. ఆధునీకరణ అంటే ఒక దేశం మరొక దేశాన్ని దోచుకోవడం కాదని, అన్ని దేశాలు కలిసి అభివృద్ధి చెందడమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెనుజుల అధ్యక్షుడు నికోలస్‌ మధురో, సౌత్‌ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా, బోలివియా మాజీ అధ్యక్షుడు ఈవో మోరేల్స్‌, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వుసిక్‌ తదితరులు మాట్లాడారు. అనేక దేశాధినేతలు, వివిధ దేశాలకు చెందిన అధికార, ప్రతిపక్షనేతలు పాల్గొన్నారు. దక్షిణాఫ్రియా, పోర్చుగీస్‌, వియుత్నాం, బ్రెజిల్‌, ఉత్తరకొరియా తదితర దేశాల కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు కూడా పాల్గొన్నాయి. సీపీఐ(ఎం) తరపున ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్‌.అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love