విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్ల కట్టుకథలు, పిట్టకథలు!

నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందజేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందజేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది. ఇప్పటికీ అదే జరుగుతోంది.
ఒకటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాత వివిధ దేశాల ఆర్థిక రంగాలు ఎలా కోలుకుంటాయి, ఉక్రెయిన్‌ సంక్షోభం ఎలా ముగుస్తుంది. చైనా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అన్నవి ఎక్కువగా చర్చలో ఉన్న అంశాలు. కొద్ది రోజులుగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి సోషల్‌ మీడియా, సంప్రదాయ మీడియాలో కూడా కొందరు తెగ స్పందిస్తున్నారు. విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లంటూ ప్రచారం సాగుతున్నది. ప్రపంచ ఆర్థిక రంగంతో చైనా ముడిపడి ఉన్నంతగా ప్రపంచంలో ప్రస్తుతం మరొక దేశం లేదని గ్రహించాలి. 2018 తరువాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా మంత్రి క్విన్‌ గాంగ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు జపాన్‌ వార్తా సంస్థ నికెయి పేర్కొన్నది. దాపరికం ఏమీ లేదు, చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అంటూ చొక్కా చేతులు మడుస్తున్న అమెరికా మూసిన తలుపుల వెనుక ఏమి చర్చించి ఉంటుంది. రెండు దేశాల సంబంధాల గురించి సుభాషితాలు చెప్పటం కాదు, ఆచరణలో చూపండి అని చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ చెప్పినట్లు వెల్లడైంది. మరోసందర్భంలో దాని గురించి చూద్దాం.
చైనా ఆర్థిరంగం మందగించిందంటూ అనేక కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి బీజింగ్‌ వచ్చాడు. అందరూ చెబుతున్నట్లు నిజంగా ఆర్థికంగా కుంగిపోతుందా? గడచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మంది ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నారు. మరింకేమీ పని లేనట్లు కొందరు వాటిని మన జనానికి సరఫరా గొలుసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిస్తున్నారు. మే నెలలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ప్రభుత్వం వివరాలను వెల్లడిస్తున్నది. మన సర్కార్‌ మాదిరే చైనా కూడా అదే చేసింది. ఏప్రిల్‌ మాసంతో పోలిస్తే ఆర్థికరంగం పురోగతి మందగించిందని పేర్కొన్నది. దాన్ని చూపి ఇంకేముంది ఫినిష్‌ అన్నట్లుగా సంబరపడి పోతున్నారు. వేగం తగ్గటం వేరు, ప్రతికూల వృద్ధి నమోదు వేరు. చైనా తనను తాను సమర్థించుకోగలదు,లోపాలు ఉంటే సరిచేసుకోగలదు. దాన్ని ఎవరూ భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. వామపక్ష శక్తులే కాదు, ఇతరులకూ అక్కడి పరిణామాల వాస్తవాలను తెలుసు కోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. అంతర్జాతీయ వాతావరణం ఇప్పటికీ సంక్లిష్టంగాను, తీవ్రంగా ఉందని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్తబ్దుగా ఉందని, తమ ఆర్థికరంగం సరిగానే కోలుకుంటున్నప్పటికీ, మార్కెట్‌ గిరాకీ ఇంకా తక్కువగా ఉందని చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పారు. ఏ రంగంలో ఎంత పురోగతి ఉంది, దేనిలో ఎంత తిరోగమనం ఉందో కూడా అంకెలను వెల్లడించారు. మందగమనాన్ని అరికట్టి వేగాన్ని పెంచేందుకు ఉద్దీపన పాకేజీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో భాగంగానే 2.75శాతం ఉన్న వడ్డీ రేటును 2.65కు తగ్గించింది.
ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అనే అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వే గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దాని ప్రకారం 74శాతం మంది జీవన వ్యయ పెరుగుదల, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితి గురించి ఆందోళన వెల్లడించగా, 63శాతం మంది సేవలు, అత్యవసరంగాని వస్తువుల గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారట. మరి మన కేంద్ర ప్రభుత్వం పాకేజీలేమైనా ప్రకటిస్తుందా? ఆరున్నరశాతంగా ఉన్న వడ్డీ రేటును తగ్గిస్తుందా? ఎందుకంటే చైనా కంటే మన పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు కదా! చైనాలో వేతనాలు పెరుగుతున్నందున తక్కువ ధరలకు అక్కడ సరుకులను ఉత్పత్తి చేసేందుకు వీలులేని కారణంగా కంపెనీలు మనవైపు చూస్తున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎర్రతివాచీలు పరచి ఏమేమి రాయితీలు ఇచ్చేది చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. బండి గుర్రానికి గడ్డి చూపించి పరుగెత్తిస్తున్నట్లు తాము సూచించిన సంస్కరణలను అమలు జరిపితే అప్పుల పరిమితి పెంచుతామని చెబుతోంది తప్ప జనజీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వమూ ముందుకు రావటం లేదు, రాష్ట్రాలనూ కోరిన దాఖలాలు లేవేమి?
చైనా నుంచి తరలి పోతున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించిన మాట నిజం. అవి మన దేశానికి వస్తాయని చెప్పిన వారి అంచనాలు తప్పిందీ అంతే వాస్తవం. 2022 డిసెంబరు నాటికి తొమ్మిది నెలల కాలంలో మన దేశానికి వచ్చిన ఎఫ్‌డిఐలు 36.7 బి.డాలర్లు, అదే అంతకు ముందు ఏడాది వచ్చిన మొత్తం 43.2 బి.డాలర్లని మార్చి 20న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక వార్త పేర్కొన్నది. చైనాలో కూడా ఎఫ్‌డిఐ పెరుగుదల తగ్గినప్పటికీ 2022లో కొత్తగా 18,532 విదేశీ పెట్టుబడి సంస్థలు నమోదైనట్లు, అంతకు ముందేడాదితో పోలిస్తే 38.3శాతం ఎక్కువని చైనా పేర్కొన్నది. ప్రపంచమంతటా కరోనా లాక్‌డౌన్లు ఎత్తివేసినా చైనాలో 2022 డిసెంబరు వరకు దాదాపు దేశమంతటా సున్నా కోవిడ్‌ కేసులు అనే విధానంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగింది, తరువాత ఎత్తివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తిరిగి అనేక రంగాల్లో వినిమయం పెరిగి మే నెలలో తగ్గిందని చెబుతున్నారు. దాన్ని నమ్మటమా లేదా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతర్గత మార్కెట్‌తో పాటు అనేక ధనిక దేశాల్లో తలెత్తిన మాంద్యం కూడా తోడైంది. మన దేశంలో ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుతో పోలిస్తే వర్తమాన సంవత్సరం రేటు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే చైనాకూ వర్తించుతుంది.
చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మే నెలలో 20.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సర్వే వెల్లడించింది. మన దేశంలో ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడి పరిస్థితి మామూలేగా, అద్భుతాలు సృష్టిస్తున్నదని చెబుతున్న చైనాలో అలా ఉండటం ఏమిటని కొందరు అమాయకత్వాన్ని నటిస్తారు. చైనా పురోగతి అద్భుతమనటంలో ఎలాంటి సందేహం లేదు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చగల స్థాయికి ఇంకా పెరగలేదు గనుకనే కొన్ని సమస్యలు. వాటిని తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చూస్తున్నదా లేదా లేక మన ప్రధాని చెప్పినట్లు పకోడీ, బజ్జీల బండి పెట్టుకొని ఉపాధి చూసుకోండని గాలికి వదలివేసిందా అన్నదే ప్రశ్న. మన దేశంలో ఏటా 65లక్షల మంది డిగ్రీలు తీసుకొని కాలేజీల నుంచి వెలుపలికి వస్తుంటే చైనాలో దానికి రెట్టింపుగా రికార్డు స్థాయిలో 115.8లక్షల మంది ఈ ఏడాది వచ్చారు. మే నెలలో మొత్తం 3.3కోట్ల మందికి గాను 2.6కోట్ల మంది ఏదో ఒక ఉపాధిలో చేరారని, 60లక్షల మంది వేచి ఉన్నారని కూడా చైనా సర్వే పేర్కొన్నది. మన దేశంలోని సిఎంఐఇ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం పాతికేండ్ల లోపు యువత మన జనాభాలో 40శాతం ఉన్నారు. వారిలో 2022 డిసెంబరు నాటికి 45.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాలో 20శాతంపైన ఉంటే అక్కడి వారి గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నవారు మన దేశంలో దానికి రెట్టింపుకు మించి ఉన్నవారి గురించి మాట్లాడరేం? చైనాలో మే నెలలో నిరుద్యోగులు మే నెలలో 4.1శాతం, అదే మన దేశంలో ఏప్రిల్‌ నెలలో 8.11శాతం ఉంది.
చైనా గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక విజయాలతో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. వాటిని అధిగమించి ముందుకు పోతున్నది. ఇప్పుడు కూడా అంతే. అక్కడి నాయకత్వం మరింత పరిణితి చెందింది. కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు క్రిమి కీటకాలు కూడా లోనికి వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ చైనా మార్కెట్‌ను తెరిచేటపుడు చెప్పాడు. ఇప్పుడూ ఎదురైన సవాళ్లను అదిగమించగలదని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు. మన దేశంతో సహా విదేశాలలో 110చైనా పోలీస్‌ స్టేషన్లు అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తన వ్యతిరేకులను పట్టుకొనేందుకు అనధికారికంగా వాటిని తెరిచిందనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది. దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా ఈ కట్టుకథలను పిట్టకథలను నమ్ముతున్నవారు లేకపోలేదు.
తమ రాజధాని సియోల్‌, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చైనా రహస్య పోలీస్‌ స్టేషన్ల గురించి విచారణ జరుపుతున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తాజాగా చెప్పారు. ఒక చైనా రెస్టారెంట్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు గుర్తించారట. స్పెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం 53దేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయట. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు వివిధ దేశాల్లో ఉన్న తమ జాతీయులను స్వదేశానికి రప్పించేందుకు కొన్ని సంస్థలు పని చేశాయి తప్ప పోలీస్‌ స్టేషన్లు లేవని మే 15న చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా జాతీయులు నిర్వహించే రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల ముసుగులో పోలీస్‌ స్టేషన్లు నడుపుతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో అలాంటి ఒక పోలీస్‌ స్టేషన్ను పట్టుకున్నామని, 1998 నుంచి పని చేస్తున్న ఒక ధార్మిక సంస్థకు చెందిన ఇద్దర్ని గుర్తించినట్లు అమెరికా పోలీసులు ప్రకటించారు. నగరంలోని చైనీయులకు అవసరమైన సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ బహిరంగంగానే మీడియాలో చిరునామాతో సహా ప్రకటనలు జారీ చేసినప్పటికీ అమెరికా పోలీసులు అది రహస్యంగా పని చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటివే ఉన్నట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ చెప్పటంతో మూడు అనుమానిత ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు, చట్ట ఉల్లంఘనలు కనిపించలేదని బ్రిటన్‌ భద్రతా మంత్రి టామ్‌ ప్రకటించాడు.
చైనా పోలీస్‌ స్టేషన్ల ప్రచారం సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ నుంచే జరుగుతోందన్నది స్పష్టం. దీని కథను చూస్తే అది అమెరికా సిఐఏ ఏర్పాటు చేసినది అని స్పష్టం అవుతున్నది. మానవహక్కుల కార్యకర్త పేరుతో స్వీడిష్‌ జాతీయుడైన పీటర్‌ డాహిలిన్‌ చైనాలో 2009లో కుర్ర లాయర్లు, గ్రామీణులకు సాయం చేసే పేరుతో చైనా యాక్షన్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. చేస్తున్న సాయం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటం అసలు లక్ష్యంగా వెల్లడి కావటంతో 2016 చైనా అధికారులు డాహ్లిన్‌తో సహా పని చేస్తున్న వారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు. కొందరు కనిపించకుండా పోయారు. డాహ్లిన్‌ కేవలం 23రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. తాను చట్టవిరుద్దంగా పని చేశానని అంగీకరించటంతో విడుదల చేసి పది సంవత్సరాల పాటు తిరిగి చైనాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి చైనా గురించి ప్రపంచానికి కట్టుకథలు చెప్పటం ప్రారంభించాడు. నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందజేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందజేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది. ఇప్పటికీ అదే జరుగుతోంది. చైనా గురించి ఎన్నిక కథలు చెప్పినా దాని పురోగతి ఆగటం లేదు, ఆగదు!
ఎం. కోటేశ్వరరావు

Spread the love