చైనీస్‌ తైపీ, కొరియా చిత్తు

– టీమ్‌ ఇండియా ఏకపక్ష విజయాలు
– ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్స్‌
న్యూఢిల్లీ : ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఎదురు లేదు. డిఫెండింగ్‌ చాంపి యన్‌ టీమ్‌ ఇండియా వరుస మ్యాచుల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. చాంపియన్‌షిప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో చైనీస్‌ తైపీని మట్టికరిపించింది. దక్షిణ కొరియాపై 76-13తో గెలుపొం దిన భారత్‌.. చైనీస్‌ తైపీపై 53-19తో విజయం సాధించింది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ప్రథమార్థంలో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించగా.. భారత్‌ 40 పాయింట్లు కొల్లగొట్టింది. ద్వితీయార్థంలో దక్షిణ కొరియా కాస్త ప్రతిఘటన చూపించటంతో 9 పాయింట్లు దక్కించుకుంది. 63 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్‌ టైటిల్‌ వేటను ఘనంగా మొదలు పెట్టింది. తర్వాతి చైనీస్‌ తైపీతో మ్యాచ్‌లో భారత్‌ 34 పాయింట్ల తేడాతో గెలుపొందింది. ఏడు సంవత్సరాల విరామం అనంతరం జరుగుతున్న ఆసియా చాంపియన్‌ షిప్స్‌లో భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో నేడు జపాన్‌తో తలపడనుంది. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పాకిస్థాన్‌పై గెలుపొంది భారత్‌ విజేతగా అవతరించింది.

Spread the love