డ్యాన్స్‌ మీదున్న ఆసక్తి వల్లే గిన్నీస్‌ రికార్డ్‌ : చిరంజీవి

నవతెలంగాణ హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందిన తెలిసిందే. డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా చిరంజీవి అరుదైన రికార్డు నెలకొల్పారు. అందుకు సంబంధించిన ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ ఖాన్‌ చేతుల మీదుగా చిరంజీవి (యాక్టర్‌/డ్యాన్సర్‌)అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. డ్యాన్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు అందరితో షేర్ చేసుకున్నారు. నేను ఊహించనిది ఈ ఈవెంట్‌ ఇంత గ్లామర్‌గా మెమెరబుల్‌గా ఉందంటే కారణం నా మిత్రుడు అమీర్‌ఖాన్‌. ధన్యవాదాలు. గిన్నీస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేనెప్పుడూ ఊహించనిది. గిన్నీస్‌ బుక్‌కు మనకు ఏం సంబంధమనే ఆలోచన ఉంటుంది కదా సహజంగా.. నాకలాంటి ఆలోచన ఏం లేదు. అలాంటిది.. ఎదురుచూడనట్వంటి గొప్ప గౌరవం ఇవాళ నా సినీ ప్రస్థానంలో తారసపడినందుకు ఆ భగవంతుడికి.. దానికి కారణభూతులైన నా దర్శకనిర్మాతలు, అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు.
నాకు నటన కంటే కూడా డ్యాన్స్‌ మీదున్న ఆసక్తి ఈ రోజు ఈ అవార్డ్‌ వచ్చేలా చేసిందా అని నాకనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను నటనకు శ్రీకారం చుట్టేకంటే ముందు డ్యాన్స్‌కు ఓనమాలు దిద్దానేమోననిపిస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూన్నవాళ్లను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం అప్పట్లో ఉండే వివిధ భారతి, రేడియో సిలోన్ (శ్రీలంక రేడియో స్టేషన్‌ ) కానీ.. వీటిలో వచ్చే తెలుగు పాటలు మాకు ఇన్‌స్పిరేషన్‌ అని తెలిపారు. అప్పట్లో ఆర్థికంగా గ్రామ్‌ఫోన్‌, టేప్‌ రికార్డర్‌ కానీ ఉండే పరిస్థితి లేదు. ఒక్కోసారి రేడియోలో పాటలు ఎప్పుడొస్తాయని అందరూ ఎదురుచూసేవారు. రాగానే శంకర్ బాబును పిలవండి.. డ్యాన్స్ చేస్తాడు.. మనల్ని అలరిస్తాడని వాళ్లంతా ఉత్సాహంగా ఉంటే.. నేను ప్రోత్సాహంగా తీసుకొని డ్యాన్స్ చేస్తుండేవాడినంటూ తన జ్ఞాపకాలను చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

Spread the love