సైఫ్‌పై దాడి.. ఎంతగానో మమ్మల్ని కలచివేసింది: చిరంజీవి, ఎన్టీఆర్‌

నవతెలంగాణ హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సినీ నటులు చిరంజీవి, ఎన్టీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తాము షాకయ్యామని అన్నారు. ‘‘సైఫ్‌ అలీఖాన్‌పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు. ‘‘సైఫ్‌ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు ఈ దాడిపై సైఫ్‌ సతీమణి కరీనాకపూర్‌ టీమ్‌ ప్రకటన విడుదల చేసింది. ‘‘గత రాత్రి సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. సైఫ్ చేతికి గాయం కావడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని పేర్కొంది. గతేడాది విడుదలైన ‘దేవర’ కోసం ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి వర్క్‌ చేశారు. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్‌ భైరవ అనే ప్రతినాయకుడి పాత్రలో నటించారు. సైఫ్‌ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.

Spread the love