లలిత సంగీత శిఖరం చిత్తరంజన్‌ కన్నుమూత

– ఆకాశవాణిలో మూడు దశాబ్దాలకుపైగా స్వరకర్తగా సేవలు
నవతెలంగాణ-కల్చరల్‌
తొలితరం లలిత సంగీత శిఖరం.. డాక్టర్‌ మహాభాష్యం చిత్త రంజన్‌(85) శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ కొత్తపేటలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆకాశవాణిలో మూడు దశాబ్దాలపైగా లలిత సంగీతం స్వరకర్తగా, అధికారిగా, గాయకుడిగా పనిచేశారు. దూరదర్శన్‌ తెలుగు కార్యక్రమాలు ప్రారంభం నుంచి ఆయన విధులు నిర్వర్తించారు. ప్రసిద్ధ కవులు సినారె, దాశరథి దేవులపల్లి కృష్ణశాస్త్రి తదితరుల లలిత గీతాలను స్వర పరచి వాటికి ప్రాచుర్యం కల్పించారు. ఆకాశవాణిలో ఈ పాట నేర్చుకొందాం, కలిసి పాడుదాం కార్యక్రమ రూప కల్పనలో ఎందరో గాయనీ గాయకులను చిత్త రంజన్‌ పరిచయం చేశారు. ప్రభుత్వ పురస్కారాలు, సాంస్కృతిక సంస్థల సత్కారాలు ఎన్నో అందుకున్న చిత్తరంజన్‌ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం విభాగానికి కోర్స్‌ను రూపొందించి ఉపన్యాసకునిగా పనిచేశారు. ఆయన ముగ్గురు కుమార్తెలు సంగీతరంగంలో ప్రసిద్ధులు. చిత్తరంజన్‌ అంత్యక్రియలు శనివారం తార్నాక శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పలువురి సంతాపం
చిత్తరంజన్‌ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గొప్ప సంగీత కళాకారున్ని కోల్పోయామని ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కెవి.రమణ అన్నారు. తుది వరకూ లలిత సంగీతమే శ్వాసగా జీవించారని కొనియాడారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. లలిత సంగీతం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. గాన సభతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని గాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి తెలిపారు. పలువురు సంగీత కళాకారులు కలగా కృష్ణమోహన్‌ శశికళ, సురేఖ వి.కె.దుర్గ, రమణకుమారి తదితరులు సంతాపం ప్రకటించారు.

Spread the love