– రైతు భరోసా రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంచుతామన్నారు.. ఎప్పటి నుండి ?
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ – సంగారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్ధానిక కేవల్ కిషన్ భవన్లో సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చుక్క రాములు మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏడు నెలల పాలన పూర్తయిందనీ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నదని గుర్తు చేశారు. నేటికీ గృహజ్యోతి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. రైతుభరోసా కింద పంట పెట్టుబడిసాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, రూ.10 వేల నుండి రూ.15 వేలకు పెంచి అమలు చేస్తామని చెప్పారని ఎప్పటి నుండి అమలు చేస్తారని ప్రశ్నించారు. పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడేలా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించి అమలు చేయాలని కోరారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి, ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలనీ, ఖాళీపోస్టులను భర్తీ చేయాలని కోరారు. హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి ప్రకటించాలని చెప్పారు. పెన్షన్లు పెంచాలన్నారు. గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలివ్వాలనీ, ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాల పెండింగ్ బిల్లులను చెల్లించాలనీ, బకాయిలను విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని చెప్పారు. కార్మికుల కనీస వేతనాల జీవోలను పెరిగిన ధరలకను గుణంగా సవరించాలనీ, కొత్త జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజయ్య, మల్లేశం, అతిమేల మానిక్, రామచందర్, సాయిలు, నాయకులు రేవంత్ కుమార్, నర్సింలు, యాదగిరి, ప్రవీణ్, మహిపాల్, విద్యాసాగర్, పాండు రంగారెడ్డి, అశోక్, నాగేశ్వర్ రావు, రమేష్, రాజయ్య తది తరులు పాల్గొన్నారు.