నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : నగరంలో ఒక ఇన్‌స్పెక్టర్ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీజీ విజరుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ బాలూ చౌహాన్ ఒక వ్యక్తిపై కేసు లేకుండా చేయటానికి లక్షన్నర రూపాయలను డిమాండ్ చేశాడు. ఒక మిస్సింగ్ కేసులో నిందితుడైన ఆ వ్యక్తి తాను అంతగా డబ్బులు చెల్లించుకోలేనని చెప్పటంతో చివరికి రూ.50 వేలు ఇచ్చేలా చౌహాన్.. ఆ వ్యక్తిని ఒప్పించాడు. ఈ విషయమై సమాచారమందుకున్న ఏసీబీ అధికారులు నిఘా వేసి చౌహాన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్‌ను హైదరాబాద్ ఏసీబీ కేసుల ప్రత్యేకకోర్టులో హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గతంలో కూడా చౌహాన్‌పై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాగా, చౌహాన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకోకముందే ఆ పోలీసు స్టేషన్ నుంచి నగర పోలీసు కమిషనర్ ఆయనను బదిలీ చేశారు.