నవతెలంగాణ – హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడి అధికారులు గుర్తించారు. వస్తువులు సరఫరా చేయక పోయినా చేసినట్లు, ఫేక్ ఇన్వాయిస్‌లను సఅష్టించి ఐటీసీని క్లయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ఈ నేపధ్యంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశి విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్ లకు సీఐడి నోటీసులు జారీ చేసింది.
త్వరలోనే ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సీఐడి విచారించి స్టేట్ మెంట్ నమోదుకు సిద్దమవుతుంది. తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లాయంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.