ఆస్కార్‌ అందుకున్న మొదటి వెస్ట్రన్‌ సినిమా ‘సిమర్రోన్‌’

‘ది జాజ్‌ సింగర్‌’ హాలివుడ్‌లో మొదటి టాకీ సినిమా. ఇది 1927లో వచ్చింది. మెల్లిగా టాకీలు ఊపందుకుని ప్రజలను అలరించడం మొదలెట్టాయి. 1931 నుండి 1934 మధ్య వరకు వచ్చిన సినిమాలను ప్రీకోడ్‌ సినిమాలుగా అభివర్ణిస్తారు. 1934లో సినిమాలకు సంబంధించి కొన్ని నియమాలను నిర్మించుకుని (మోషన్‌ పిక్చర్‌ ప్రొడక్షన్‌ కోడ్‌) వాటి ఆధారంగానే సినిమాలు తీయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ నియమావళిని ‘హేస్‌ కోడ్‌’ అంటారు. సినిమాల్లో ఏ సన్నివేశాలు ఉండవచ్చో, ఉందకూడదో ఈ కోడ్‌ నిర్ణయిస్తుంది. సినిమాల్లో క్రూరత్వాన్ని సూచించే సన్నివేశాలు, నగ సన్నివేశాలు, రేప్‌ సీన్లు ఏ పరిధిలో ఉండవచ్చో నిర్ణయంచి సినిమాను రిలీజ్‌ చేయవలసిన బాధ్యతను ఈ కోడ్‌ సూచిస్తుంది.
ఆ కోడ్‌ నియమావళి ఆధారంగా 1931లో వచ్చిన ప్రీ కోడ్‌ వెస్ట్రన్‌ సినిమా ‘సిమర్రోన్‌’. దీనికి ఆ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డు లభించింది. 1930లో వచ్చిన ఎడ్నా ఫర్బర్‌ నవల సిమర్రోన్‌ ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. మొదటి రిలీజ్‌లో ప్రొడక్షన్‌ ఖర్చులు రాబట్టుకోలేక పోయినా ఈ సినిమా అప్పట్లో విశ్లేషకులను బాగా అలరించింది. ఇప్పటి దాకా కేవలం నాలుగు వెస్ట్రన్‌ సినిమాలను మాత్రమే అకాడమీ, ఉత్తమ చిత్రాలుగా ఎంచి సత్కరించింది. అందులో సిమర్రోన్‌ మొదటిది. అంటే హాలివుడ్‌ చరిత్రలో అకాడమీ అవార్డు పొందిన మొదటి వెస్ట్రన్‌ సినిమా ఇది.
అమెరికా భూభాగంలోని పడమర ప్రాంతంలోని ప్రజల స్ఫూర్తిని, పోరాటాన్ని సూచించే కథనాత్మక చలనచిత్ర శైలిని వివరించే చిత్రాలకు ‘వెస్ట్రన్‌’ అనే పదం ఉపయోగిస్తారు. జూలై 1912లో మోషన్‌ పిక్చర్‌లోని కథనంలో మొదటిసారి ఈ పదం ప్రయోగించారు. నేడు అమెరికా అనబడే భూభాగంలో అంతకు ముందు ఎందరో వివిధ జాతులకు చెందిన స్థానికులు ఉండేవారు. వీరిని ఖాళీ చేయించి ఆ స్థలాలను ఆక్రమించుకుని అమెరికా రాజ్యం నిర్మించారు. క్రీక్‌, సెమినోల్‌ తదితర జాతులు ఒకప్పుడు నివసించిన స్థలాలన్నీ ఖాళీ అయ్యాక, ఏప్రిల్‌ 22, 1889 న వాటిని ప్రభుత్వం అమెరికా పౌరులకు ఇచ్చింది. ఆ స్థలంలో తమ భూమిని ఎన్నుకునే స్వేచ్ఛను వారికి ఇచ్చినప్పుడు వందల సంఖ్యలో ప్రజలు గుర్రాలపై పరుగెత్తుతూ తమకు కావలసిన స్థలాన్ని ఎన్నుకోవడం, అమెరికా చరిత్రలో ఓ మర్చిపోలేని రోజు. అలా పభుత్వ అనుమతితో పొందిన స్థలాలతో ఒక్లాహోమా నగరాన్ని నిర్మించారు. దీన్నే ఒక్లాహోమా సెటిల్మెంట్‌ అంటారు.
సిమర్రోన్‌ సినిమా ఈ ఒక్లాహోమా సెటిల్మెంట్‌తో మొదలవుతుంది. దీని కోసం ఎందరో ఎక్స్‌ట్రాలతో దర్శకుడు వెస్లీ రగల్స్‌ సీన్లు షూట్‌ చేశారు. సినీ చరిత్రలో అద్భుతమైన పిక్చరైజేషన్‌గా ఈ సీన్లను ఈ రోజుకీ గుర్తు చేసుకుంటారు. అలా యాన్సీ క్రావెట్‌ అనే మన కథానాయకుడు తన కుటుంబం కోసం స్థలాన్ని పొందుతాడు. అతనికి సబ్రా అనే యువతితో వివాహం జరుగుతుంది. యాన్సి సాహసోపేతమైన జీవితాన్ని కోరుకునే యువకుడు. ఒక చోట స్థిర నివాసం ఏర్పరుచుకుని జీవించడం అతని నైజం కాదు. ఇది సబ్రా తల్లితండ్రులకు నచ్చదు. భర్తని అమితంగా ప్రేమించే సబ్రా తల్లిదండ్రులు వద్దంటున్నా కొడుకుతో కలిసి నిర్మాణంలో ఉన్న ఈ కొత్త నగరానికి యాన్సీ కోరికను అంగీకరించి వస్తుంది. ఏ సౌకర్యాలు లేకుండానే అక్కడ జీవించడానికి అలవాటుపడుతుంది. కాని ఆమెకు కూడా అందరి స్త్రీల వలే తన ఇంటిపట్ల కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కొత్త నగరంలో మెల్లిమెల్లిగా తన ఇంటిని సవరించుకుంటుంది. కొందరు స్నేహితులను ఏర్పరుచుకుంటుంది.
ఈ భూమి కోసం పరిగెడుతున్నప్పుడు యాన్సీతో డిక్సీలీ అనే ఓ వేశ్య పోటీపడుతుంది. అతన్ని మోసం చేసి అతను కోరుకున్న భూమిని తనదిగా చేసుకుంటుంది. యాన్సీ దీన్ని పెద్దగా పట్టించుకోడు. ఈ డిక్సీలీ కూడా అదే నగరంలో భాగం అవుతుంది. అక్కడే యాన్సీ ఓ చిన్న పత్రిక మొదలెడతాడు. ఆ నగరంలో కొందరు చట్టవిరుద్దంగా ప్రవర్తించే దుండగులు ఉంటారు. వీరు కొత్తగా చేరిన వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. లాన్‌ అనే ఓ వ్యక్తిని అందుకే యాన్సీ చంపేస్తాడు. దానికి స్థానికులు అతన్ని మెచ్చుకుంటారు. యాన్సీ ఆ ఊరికి హీరోగా మారతాడు. సబ్రా పుట్టింటి నుండి ఓ నల్ల జాతి పనివాడు వీరిపై ప్రేమతో తన కుటుంబాన్ని వదిలేసి వస్తాడు. ఆ స్థలంనుండి గెంటివేయబడిన కొందరు స్థానికులు జన్మభూమి మీద మమకారంతో తిరిగి వచ్చి అక్కడే ఉండిపోతారు. వీరిని కొత్తగా వచ్చినవారు అనాగరికులుగా గేలి చేస్తూ ఉంటారు. ఇది యాన్సీ ఇష్టపడడు. యాన్సీ వివాహానికి పూర్వం సంచారిగా జీవించిన క్రమంలో దోపిడి మార్గంలో జీవించే కొందరితో స్నేహం చేస్తాడు. అందులో ఒకడు ‘ది కిడ్‌’. ఒక్లాహోమా ప్రాంతం ఏర్పడ్డాక ఓసేజ్‌ అనే నగరంలో జీవిస్తున్నప్పుడు అక్కడ దాడి చేసిన వారిని ఎదుర్కొనే సందర్భంలో ఈ కిడ్‌ను యాన్సీ చంపేస్తాడు. ఆ యుద్ధంలో కిడ్‌తో పాటు తుపాకి గుండు తగిలి యాన్సీ ఇంట పని చేసే ఆ నల్ల పనివాడు కూడా మరణిస్తాడు. వీరి మరణం ఎవరినీ పెద్దగా బాధపెట్టదు. ఆ రోజుల్లో నల్లజాతీయులు ఆ ప్రాంతపు స్థానిక తెగల వారి పట్ల తెల్లవారి క్రౌర్యం ఎలా ఉందో ఈ సంఘటన వివరిస్తుంది.
కిడ్‌ని చంపాక యాన్సీ చాలా అందోళనకు గురవుతాడు. అతనికి నగరంలో ఉండబుద్ది అవదు. చెరోకీ ప్రాంతంలో మళ్లీ భూపంపకం వస్తుందని తెలిసి అక్కడకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటాడు. సబ్రా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇంత గౌరవాన్ని, స్నేహాన్ని ఇక్కడ పొంది అన్నీ వదిలి మరోచోట మొదటి నుండి జీవితాన్ని నిర్మించుకోవడం మూర్ఖత్వం అని ఆమె భావిస్తుంది. అందుకని యాన్సీ ఒక్కడే భార్యాపిల్లలను వదిలి వెళ్ళిపోతాడు. అప్పటికి కొడుకుతో పాటు వీరికి డొనా అనే కూతురు ఉంటుంది. సబ్రా ఒక్కతే పత్రిక నడుపుతూ పిల్లలను పెంచుతుంది. ఐదు సంవత్సరాల తరువాత యాన్సీ మళ్ళీ ఆ ఊరికి వస్తాడు. భార్యాపిల్లలను కలుస్తాడు. కాని తాను డిక్సీలీ పట్ల ఆ ఊరివారు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చానని ప్రకటిస్తాడు. ఇది సబ్రాను ఇంకా బాధిస్తుంది. డిక్సీలీని ఆ ఊరి నుండి తరిమి వేయాలని అందరూ ప్రయత్నిస్తారు. దానికి సబ్రా నాయకత్వాన కోర్టుకేసు నడుస్తూ ఉంటుంది. న్యాయశాస్త్రం పట్టా పొందిన యాన్సీ డిక్సీలీ తరుపున వాదించి ఆమె గతాన్ని వివరించి అసహాయురాలయిన ఆమె తన శరీరాన్ని అమ్ముకోవలసిన స్థితికి కారణం ఆమెను మోసగించిన వారు అని, దానికి ఆమెను శిక్షించడం తప్పని ఆమెకు ఆ ఊరిలో రక్షణ కల్పిస్తాడు. మొదటిసారి సబ్రా ఇతర జాతీయులను, అసహాయిలను చూసే దృష్టిని మార్చుకుంటుంది. భర్తలోని సామ్యవాద ఆలోచనలు ఆమెకు మెల్లిమెల్లిగా అర్ధం అవుతాయి.
1907 లో ఒక్లాహోమా పూర్తి స్థాయి రాష్ట్రం హోదాను సంతరించుకుంటుంది. ఆయిల్‌ బూమ్‌తో ఆ నగరం ధనిక ప్రాంతంగా మారుతుంది. వీరితో పాటు అక్కడ నివసించే స్థానిక తెగలను యాన్సీ ఎంతో ప్రోత్సహిస్తాడు. మళ్లీ సంచారిగా మారి కొన్ని సంవత్సరాల పాటు కుటుంబానికి దూరం అవుతాడు. అప్పుడు సబ్రా ఒక్కత్తే బిడ్డలను, ఇంటిని చూసుకుంటుంది. ఆమెను ఆరాధించే ధనిక స్నేహితుడిని సబ్రా ప్రేమించలేకపోతుంది. యాన్సీ స్థానాన్ని ఎవరికీ ఆమె ఇవ్వలేదు. అంతగా భావాలు కలవకపోయినా యాన్సీని ఆమె ప్రేమిస్తుంది.. అయినా భర్తలా స్థానిక తెగలను తమతో సమానంగా చూడలేక పోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆమె కొడుకు ఓ స్థానిక తెగకు చెందిన యువతిని వివాహం చేసుకుంటాడు. మొదట్లో ఆమె దీన్ని వ్యతిరేకించినా భర్త భావాలు, అతను ఇంటిని దూరంగా ఉండి చేస్తున్న పని, ఇవన్నీ ఆమెలో క్రమంగా మార్పు తీసుకువస్తాయి. తనలోని అధికార భావజలాన్ని ఆమె మెల్లిమెల్లిగా దూరం చేసుకుంటుంది. అలా సబ్రా ఆ నగరంలో రాజకీయంగా ఎదిగి ఒక్లాహోమాలో మొదటి మహిళా కాంగ్రెసు సభ్యురాలిగా ఎన్నికవుతుంది. ఓ ప్రమాదంలో ఇరుక్కున్న కార్మికుల మధ్య ఆమె భర్తను కొనప్రాణాలతో ఉండగా చివరి సారిగా చూస్తుంది. ఆమె ఒడిలోనే అతను మరణిస్తాడు.
సబ్రా, యాన్సీ ఇద్దరూ తమ కాపురంలో విడిగా ఉన్న సంవత్సరాలే ఎక్కువ. కాని ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమ. ఓ సందర్భంలో నేను దూరంగా ఉన్నా నువ్వు తప్ప మరో స్త్రీ నా జీవితంలో ఎప్పుడూ లేదు, రాదు అని స్పష్టంగా చెబుతాడు యాన్సీ. సబ్రా కూడా అంతే నిబద్దతతో ఉంటుంది. ఆలోచనల రీత్యా వారిలో ఎంతో దూరం ఉంది. యాన్సీ అందరినీ ఒకే విధంగా ప్రేమించే మనిషి. అమెరికా దేశ నిర్మాణంలో స్థానిక తెగలకు జరుగుతున్న అన్యాయం అతన్ని కలిచి వేస్తుంది. అందుకే స్థిర జీవితాన్ని కాదని వారితో కలిసి ఉండటానికి ఇష్టపడతాడు. నగర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూనే అందరికీ సమాన హక్కులు ఉండాలని తాపత్రయపడతాడు. వారిని వేరుగా, తక్కువగా చూడడం అతనికి నచ్చదు. వారితో పాటు సామరస్యమైన జీవితం కోసం పని చేస్తాడు. అమెరికా నిర్మాణ సమయంలో మానవతావాదులు పడిన సంఘర్షణకు ప్రతీక యాన్సీ. సబ్రా అతనిలోని ఈ సమానత్వ భావాన్ని అర్ధం చేసుకోదు. కాని మెల్లిగా అతని ఆశయాలకు అనుగుణంగా జీవించడంలోని ఆనందాన్ని అనుభవిస్తుంది. తన కోడలి రూపంలో స్థానిక తెగకు చెందిన యువతి రావడంతో ఆమెలో మార్పుని స్వీకరించవలసిన అవసరం అర్ధం అవుతుంది.
అమెరికా నిర్మాణంలో అప్పటి పౌరులలోని భిన్న దృవాలను ఈ సినిమా ఓ కుటుంబ నేపధ్యంలో చూపిస్తుంది. రిచర్డ్‌ డిస్‌, ఐరీన్‌ డన్‌ నటించిన ఈ చిత్రానికి ఆరు విభాగాలలో ఆస్కార్‌ నామినేషన్లు లభించాయి. దీని తరువాత 1990 దాకా మరే వెస్ట్రన్‌ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కాలేదు. హాలీవుడ్‌ నిర్మించిన ఆణిముత్యాలలో దీని ప్రస్తావన నేటికీ ఎన్నో సందర్భాలలో వస్తుంది.

– పి.జ్యోతి,
98853 84740

Spread the love