సిన్మా బంద్‌..

Sinma Bandh..– రాష్ట్రంలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్ల నిలిపివేత
– పెద్ద హీరోల సినిమాల్లేకపోవడంతో థియేటర్లకు ప్రేక్షకులు కరువు
– ఆక్యుపెన్సీ రాక రోజువారీ ఖర్చులు రావడంలేదంటున్న యాజమాన్యాలు
– లోక్‌సభ ఫలితాల తర్వాతే తెరుచుకునే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ ఉన్న సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. ఆక్యుపెన్సీ లేక పోవడంతో వాటిని స్వచ్ఛందంగా మూసేస్తున్నట్టు పలు థియేటర్ల యజమానులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం సినిమారంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఎన్నికల హడావిడి నేపథ్యంలో ప్రేక్షకులు ఆదరించరనే భయంతో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలను ఆపేసారు. దాంతో నెల రోజులుగా సింగిల్‌ థియేటర్లకు ప్రేక్షకులు కరువయ్యారు. ఫలితంగా వాటికి రోజు వారీ ఖర్చులు కూడా రావడం లేదు. దాంతో రెండు వారాల పాటు సినిమా హళ్లను మూసేసేందుకు నిర్ణయించినట్టు ధియేటర్ల యజమానులు వెల్లడించారు. నిర్మాతలు పెద్దమనసుతో సినిమా హాళ్ల అద్దెలు పెంచాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గతంతో పోలిస్తే సినిమా చూసే ప్రేక్షకుల సగటు రోజు రోజుకూ తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీవీ, సెల్‌ఫోన్లు, ఓటీటీలు థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా చేస్తున్నాయని వాపోయారు. తెలంగాణలో దాదాపు 550 థియేటర్లుంటే అందులో 375 సింగిల్‌ స్క్రీన్‌, మిగతా 175 మల్టిప్లెక్స్‌లున్నాయి. యజమానుల నిర్ణయంతో తాత్కాలికంగా అవి బంద్‌ కానున్నాయి. లోక్‌సభ కౌంటింగ్‌ ముగిసిన తర్వాత పెద్ద హీరోల సినిమాలు విడుదలైతేనే తిరిగి హాళ్లను తెరవాలనే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నట్టు సమాచారం. ఈ నిర్ణయం ఎవరికి వారు తీసుకున్నదేనని తెలంగాణ సినిమా థియేటర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. అయితే రాష్ట్రంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయనీ, వాటి సమస్యల పరిష్కారం కోసం త్వరలో కార్యచరణ ప్రకటిస్తామని అసోసియేషన్‌ వెల్లడించింది.
కనుమరుగవుతున్న సినిమా టాకీసులు
ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వెయ్యికి పైగా సినిమా థియేటర్లుండేవి. సగటు ప్రేక్షకుడికి ఆ రోజుల్లో సినిమానే పెద్ద వినోదం. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి బ్లాక్‌లో టికెట్లు కొని మరీ సినిమా చూసే వారు. కాలక్రమంలో వచ్చిన సాంకేతిక మార్పులు సినిమా హళ్లను సంక్షోభంలోకి నెట్టాయి. ఆక్యుపెన్సీ లేక గడిచిన రెండు దశాబ్దాల కాలంలో దాదాపు సగానికి పైగా ధియేటర్లు మూతపడ్డాయి. సాంకేతిక అంశాలతో పాటు ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రాక పోవడం, థియేటర్లకు వెళితే టికెట్‌ ధరలతో పాటు తినుబండారాల ధరలు అధికంగా ఉండటం తదితర కారణాల రిత్యా ప్రేక్షకులు సినిమా హాళ్లకు ముఖం చాటేస్తున్నారు. వెరసి థియేటర్లు మూతపడుతున్నాయని సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love