నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నేత కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. శనివారం హైదరాబాద్, రామంతాపూర్‌లోని తన నివాసంలో ఆమె భౌతికకాయాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.భూపాల్, జె. చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, పద్మశ్రీ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. చంద్రమోహన్, సిహెచ్. రోజా తదితరులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. లక్ష్మీదేవమ్మ ఉమ్మడి రాష్ట్రం నుంచి మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. హైదరాబాద్ ఐద్వా ఉద్యమంలో అవిశ్రాంతంగా కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమంలో కడవరకూ పట్టుదలగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారని తెలిపారు. వారి కుటుంబం కూడా ప్రజాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధనకు సీఐటీయూ కార్యకర్తలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.