ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

– సమ్మె విచ్చినం, నిర్బంధాన్ని మానుకోవాలి
నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 నుండి నిరవధిక సమ్మెతో పాటు రిలే దీక్షలు, నిరసనలు, వంటావార్పు, జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు తదితర రూపాల్లో సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. కనీస వేతనం రూ.26,000/-లు ఇవ్వాలని, సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ పనులు రద్దు చేయాలని, సెర్చ్ సంస్థ నుండి గుర్తింపు కార్డులు తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరుగుతున్నది. యూనియన్ల అనుబంధాలకతీతంగా ఐకెపి విఓఏలు ఐక్యంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వీరికి గ్రామ సమాఖ్యలు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్డులో జరిగిన నిరసనలలో సిఐటియు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. గత 19 ఏళ్ళుగా పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా ఐకెపి విఓఏలు శ్రమిస్తున్నారు. అయినా వీరికి గౌరవ వేతనం పేరుతో రూ.3,900/-లు మాత్రమే చెల్లించడం అన్యాయం. అతి తక్కువ వేతనాలు, తీవ్ర పని భారం వంటి పరిస్థితుల్లో అనివార్యంగా సమ్మె నోటీసు ఇచ్చి ఏప్రిల్ 17 నుండి చట్టబద్ధంగా సమ్మె కొనసాగిస్తున్నారు. న్యాయమైన వీరి డిమాండ్లను సానుభూతితో పరిష్కరించకపోగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉద్యోగులను సమ్మెలోకి నెట్టింది. ఈ చట్టబద్ద సమ్మె పట్ల సెర్చ్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సమ్మెను విరమించాలని అక్రమంగా నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది అప్రజాస్వామిక వైఖరి. ఈ చర్యలను సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కలెక్టరేట్ ధర్నాల సందర్భంగా అనేక జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, లాఠీ ఛార్జీలు చేయడం, మహిళలను మగ పోలీసులు పిడి గుద్దులు గుద్దడం లాంటి అమానుష చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని సమ్మెలో జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాలి. ప్రభుత్వం నిరంకుశంగా ఇదే వైఖరిని కొనసాగిస్తే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పంచాయితీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు చొరవ తీసుకొని సెర్చ్ ఉన్నతాధికారుల సమక్షంలో సమ్మె చేస్తున్న యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయి బాబా, రాష్ట్ర ఉపాధ్యాక్షులు ఎస్. రమ, ఈశ్వర్ రావు, భూపాల్, రాష్ట్ర కార్యదర్శి జె. వెంటకటేష్, ఐకెపీ విఏఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజు కుమార్, నరేష్, సుమలత తదితరుల పాల్గొన్నారు.

Spread the love