భారతీయులను కాపాడిన పాకిస్థాన్‌ అధికారికి పౌర పురస్కారం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గతేడాది జరిగిన హజ్‌యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇక్కట్లు కలగడంతో దాదాపు 1300 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి ఎందరో యాత్రికులను కాపాడిన పాకిస్థాన్‌కు చెందిన అధికారి ఆసిఫ్‌ బషీర్‌ కు ఆ దేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘సితారే- ఇంతియాజ్‌’ ప్రదానం చేసింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ అవార్డును ఆయనకు బహూకరించారు.
గతేడాది నిర్వహించిన హజ్‌ యాత్రకు ప్రపంచ దేశాల నుంచి ఎందరో యాత్రికులు హాజరయ్యారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత, వడగాలుల వల్ల వారిలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. 1,300 మందికి పైగా మృతిచెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆ సమయంలో ఆసిఫ్‌ బషీర్‌.. మీనాలో హజ్‌ అసిస్టెంట్‌గా విధుల్లో ఉన్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన పలువురు యాత్రికులకు ఆయన తన బృందంతో కలిసి ప్రథమ చికిత్స అందించారు. 17 మంది భారతీయులు సహా 26 మందిని ఆయనతో పాటు బృందసభ్యులు భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలను నిలిపారు. ఇందుకుగానూ పాకిస్థాన్‌ మూడో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.

Spread the love