సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

– భారత సైన్యాన్ని అనుమతించమన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు
మాలె: భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు తెలిపారు. సాంకేతిక సిబ్బంది పేరిట వారంతా (భారత సైన్యం) మాల్దీవుల్లో మకాం వేసేందుకు వస్తున్నారని, అలాంటి ఆలోచనలు విరమించుకోవాలని ఆయన కోరారు. ‘భారత సైన్యం వెళ్ళిపోలేదు. యూనిఫారాలు మార్చుకొని సాధారణ సివిల్‌ దుస్తుల్లో తిరిగి వస్తున్నారు. మన హృదయాల్లో సందేహాలు రేకెత్తించే, అబద్దాలను వ్యాప్తి చేసే అటువంటి ఆలోచనలను అనుమతించం’ అని ముయిజు పేర్కొన్నారు. సైనికులు ఎంతమంది వున్నారో ఆ సంఖ్యకు సమానంగా సాంకేతిక సిబ్బందిని పంపుతామన్న షరతుపైనే మాల్దీవుల నుండి బలగాలను తొలగించేందుకు భారత్‌ అంగీకరించింది. తొలుత అనుకున్న మార్చి 10 గడువులోగానే వారిని తొలగించింది. అయినా మాల్దీవుల అధ్యక్షడు తన వైఖరిని మార్చుకోవడం లేదు. భారత సైనిక బలగాల స్థానంలో వచ్చిన సాంకేతిక బృందం కూడా వెళ్ళిపోవాలని కోరుతున్నారు. భారత్‌ బహుమతిగా ఇచ్చిన విమాన నిర్వహణలో సాయం చేసేందుకే ఈ సాంకేతిక బృందాన్ని పంపిస్తున్నామని భారత్‌ చెబుతోంది. అయితే వారు కూడా తమ దేశంలో వుండరాదని ముయిజు పట్టుబడుతున్నారు.

Spread the love