గణేష్ చతుర్థి అనగానే పూజలు నిర్వహించుకునే ప్రతి ఇంట్లో విగ్రహం తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఈ విగ్రహాలను మార్కెట్‌లో అమ్మే వాటిని ఉపయోగించడం సర్వసాధారణం.. ఇందులో వింతేముంది? మార్కెట్‌లో అందుబాటులో ఉండేవాటినే కదా ఉపయోగిస్తారు. కొత్తగా ఏముంది చెప్పడానికి అనుకుంటున్నారా? ఆ విగ్రహం తయారు చేసేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో.. విగ్రహాలన్నీ అలాగే తయారు చేస్తారు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు సమస్య దానితోనే ఉంది. అసలు దీనిని ఎక్కడ వాడవచ్చు; ఎక్కడ ఎందుకు వాడకూడదో తెలుసుకుందాం…
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కొంత మేర ఉపయోగకరమైనదే. అయితే గణేష్ విగ్రహాల్లో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పర్యావరణానికి హితం కాదు. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఇండ్లలో అలాగే ఉంచేయరు. పూజలు పూర్తయ్యాక నిమజ్జనం చేస్తారు. అలా నిమజ్జనం చేసే విగ్రహాలు నీటిలో కరగవు. పైగా ఆ నీటిని వేడిగా మారుస్తుంది. ఆ నీరు పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తుంది. తద్వారా పరిసరాలు కలుషితం అవుతాయి.
శరీర వ్యవస్థపై… : ఇందులోని భారీ మూలకాలు శరీరంలోనికి పోయి మూత్రపిండాలు, విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడు కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాలలో కోమాలోకి పోయే ప్రమాదం ఉంది. అనీమియా, రక్తహీనత, జీర్ణవ్యవస్థపై ప్రభావం పడి డయేరియా, విరేచ నాలు వంటి సమ స్యలు వస్తాయి. నీటి ద్వారా కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ శరీరంలోనికి పోయి కీళ్ళ నొప్పులు, నరాల సమస్యలు వస్తుం టాయి. దీని వల్ల 60-70 ఏండ్లకు వచ్చే సమస్యలు 30-40 ఏండ్లకే వస్తాయి. కలుషిత నీటి వల్ల చేపలు, రొయ్యలు వంటి జలచరాలపై ప్రభావం పడు తుంది. వాటిని ఆహారంగా తీసుకునే మనం వ్యాధుల బారిన పడుతున్నాము.
ఎలా తయారవుతుంది ? : జిప్సం (రసాయన నామం – కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్) ని 120-180 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ వేడి చేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేస్తారు.
ఎంత వరకు లాభం : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల లాభాలున్నా, అవి కొద్దిపాటివే. ఇండ్లలో అంతర్గతంగా గోడలకి వేసే పూతలో దీన్ని వాడతారు. అది మంటలని వ్యాపించకుండా చూస్తుంది. ఇక వైద్య రంగం విషయా నికొస్తే.. ఎముకలు విరిగినపుడు వేసే పిండికట్లలో వాడతారు. తాత్కాలిక నిర్మాణాల్లో (ఉదా : సినిమా సెట్టింగుల్లో) దీన్ని వాడతారు. అంతేకాదు, దీన్ని వాడడం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరికి వారు మేం ఒక్కళ్ళం పెట్టడం వల్లనే నష్టం కలుగుతుందా అంటూ విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఆలోచన నుంచి ఇకనైనా బయటకొద్దాం..
ప్రజల్లో చైతన్యం : గత కొన్నేళ్లుగా ”ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు, మట్టి గణపతిని పూజిద్దాం” లాంటి చైతన్యం ప్రజల్లో తీసుకొస్తున్నారు. కొందరు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు కూడా. అయినప్పటికీ మట్టి విగ్రహాల వినియోగం చాలా తక్కువగానే ఉంటుంది. ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన రాలేదు. అందుకే పర్యావరణ కాలుష్యం ఇంతలా పెరిగి పోతోంది. మున్ముందు దీనితో సమస్యలు ఇంకా ఎక్కువగానే రానున్నాయి.
ఇప్పటికైనా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగం తగ్గించి కొంతమేరైనా పర్యావరణాన్ని కాపాడుకుందాం…!