– జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు
– ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భద్రాద్రి పర్ణశాల వద్ద గోదావరి ఉధృతి
– 39 అడుగుల వద్ద ప్రవాహం పొంగిపొర్లుతున్న వాగులు
– జూరాలలో 12 గేట్లు ఎత్తివేత కడెంకు భారీగా చేరుతున్న వరద..
– హెచ్చరిక జారీ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
మూడ్రోజులుగా వర్షం తెరిపివ్వకుండా కురుస్తోంది. వాతావరణం మొత్తం ముసుగేసింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. చెరువులు, చిన్న ప్రాజెక్టులు అలుగుపారుతున్నాయి. శిథిలావస్థలోని ఇండ్లు కూలిపోయాయి. భద్రాద్రి జిల్లాలో గోదావరి అంతకంతకూ పెరుగుతోంది. చర్లలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణకు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా వస్తోంది. దీంతో ప్రాజెక్టులు నిండుతుండగా.. కొన్నింటి గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. జూరాల 12 గేట్లు ఎత్తేశారు. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుతోంది. తాలిపేరు 25 గేట్లు ఎత్తేశారు. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో అధికారులు హెచ్చరిక జారీ చేశారు. గోదావరి, ప్రాణహిత, వార్దా, పెన్‌గంగా నదులకు వరద ప్రవాహం పెరుగు తోంది.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగుకు స్వల్పంగా వరద పెరిగింది. సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు, పెనుబల్లిలో లంకసాగర్ ప్రాజెక్టు అలుగు పడుతోంది. వేంసూరు మండలంలోని అడసర్లపాడు- కొండ్రుపాడు మధ్య ఉన్న కట్టలేరు వాగు పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ విజయకుమార్ పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు.
చర్లలో అత్యధిక వర్షపాతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా శనివారం 1022 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చర్లలో 146.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ములకలపల్లిలో 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి 1,34,528 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్త కోసం 25 గేట్లు ఎత్తి 1,31,840 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 74 మీటర్లు కాగా, 73 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంచుతున్నారు. చర్లలోని ఈత వాగు, పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల గోదావరి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద ఉన్న సీతా వాగుకు గోదావరి నీరు పోటెత్తడంతో సీత నార చీరల ప్రాంతం మునిగిపోయింది. దీంతో సందర్శకులను నిలిపివేశారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మణుగూరులో వర్షాల వల్ల సింగరేణిలోని బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. శనివారం 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఓసీలోకి నీరు చేరడంతో నిలిచిపోయింది. 12 వేల టన్నుల బొగ్గు రవాణా నిలిచిపోయింది.
పెరుగుతున్న గోదావరి
ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న వరద నీరు భారీగా గోదావరిలోకి వచ్చి చేరడంతో ఇప్పటికే 39 అడుగులకు చేరుకుంది. ఉదయం 6 గంటలకు 30 అడుగులు ఉన్న గోదావరి, క్రమక్రమంగా పెరుగుతూ.. సాయంత్రం 6 గంటలకు 39 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి మరింతగా పెరిగి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం ఉందని జన వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిబ్బందనంలోకి వెళ్లాయి. గోదావరికి తోడు శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు, వీఆర్పురం, కూనవరం మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. చింతూరు నుంచి ఒడిశాకు వెళ్లే జాతీయ రహదారి వర్షాలకు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో కంట్రోల్ రూమ్‌ని ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఏర్పాటు చేశారు. ఏజెన్సీ మండలాల్లో అత్యవసర సేవలు నిమిత్తం, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 7995268352, 08743-232444, 79812 19425 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
బొగత జలపాతానికి పర్యాటకులకు అనుమతి నిరాకరణ
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలేశ్వరంలో త్రివేణి సంగమం తీరం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి ఉంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తులారాం ప్రాజెక్టు మత్తడి పోస్తోంది. ములుగు, హన్మకొండ జిల్లాలకు వాతావవరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. రామన్నగూడెం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ వద్ద గోదావరి నది నీటి ప్రవాహం 79.50 మీటర్ల మేరకు పెరిగింది. భూపాలపల్లిలో ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వరద చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 7వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత స్తంభించిపోయింది.
మూసీ రిజర్వాయర్‌లోకి వరద
నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని మూసీ రిజర్వాయర్ నీటిమట్టం 639.60అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి 1550 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 639.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.4 టీఎంసీలుగా ప్రస్తుతం 2.99 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని డ్యాం అధికారులు డీఈ చంద్రశేఖర్, ఏఈ ఉదరు కుమార్ తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. ఈ దాటికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగు ప్రవాహానికి అందవెల్లి వద్ద నిర్మించిన అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికల్‌పేట మండలం బొంబాయిగూడ ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి ఇల్లు కూలిపోయింది. కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 5500 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 7.6టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.2టీఎంసీలకు చేరుకుంది. 690అడుగుల వరకు మాత్రమే నీటిని నిల్వ చేస్తామని, మిగతాది బయటకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావం ఎక్కువైతే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు. సత్వర సాయం కోసం జిల్లా విపత్తు నివారణ బృందాల(డీడీఆర్‌ఎఫ్)ను సిద్ధంగా ఉంచినట్టు అధికారులు చెప్పారు. గోదావరి, ప్రాణహిత, వార్దా, పెన్‌గంగా నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. శనివారం 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు.
జూరాలకు భారీగా పెరుగుతున్న వరద
ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాముల నుంచి భారీ ఎత్తున వరద రావడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 83 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో నీటిమట్టం 1045 అడుగులు ఉండగా, వాటర్ లెవెల్ 318.516 నీటి నిల్వ ఉందన్నారు. 12 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదిలారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 3,473టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నట్టు పీజీపీ అధికారులు తెలిపారు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం నుంచి ముసురుతో కూడిన వర్షం కురిసింది. గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలోని భాగ్యనగర్ కాలనీలోని ప్రధాన రహదారి పక్కన చెట్టు కూలిపోయింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారుపై చెట్టు పడటంతో కారు దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లీయర్ చేశారు. షాద్‌నగర్ 8వ వార్డులో మున్సిపల్ చైర్మెన్ కొందూటి నరేందర్ పర్యటించి, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన గొల్ల శ్రీశైలం ఇంటి గోడ వర్షానికి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది.
గ్రేటర్‌లో ముసురు
గ్రేటర్ హైదరాబాద్‌లో ముసురు వర్షం ఆగకుండా కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. శుక్రవారం రాత్రి నుంచే మోస్తరు వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.