శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల గేట్లు మూసివేత

నవతెలంగాణ – హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం తగ్గిపోయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఈ క్రమంలో అధికారులు ఆ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి మాత్రమే నీరు వస్తుంది. దీంతో గత వారం రోజులతో పోలిస్తే.. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా తగ్గింది. వరద తగ్గిపోవడంతో రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ఇన్ ఫ్లో 77,598 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 68,211 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 194.3096 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ఇనో భారీగా తగ్గిపోవడంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయగా.. అనంతరం అన్ని గేట్లను మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు క్రస్ట్ గేట్ల ద్వారా 1.43 లక్షల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,541 క్యూసెక్కులు, కుడికాలువకు 3937 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 29,273 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 40,863 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 40,863 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 588.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 307.8746 టీఎంసీలుగా ఉంది.

Spread the love