500 మద్యం దుకాణాల మూసివేత..

నవతెలంగాణ – చెన్నై
రాష్ట్రవ్యాప్తంగా 500 టాస్మాక్‌ దుకాణాలు మూసివేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వాటిలో అధికంగా చెన్నై మండలంలో 138 దుకాణాలున్నాయి. ఈనెల 22న గురువారం నుంచే ఈ దుకాణాలు మూతబడనున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎక్సైజ్‌శాఖ పద్దును ప్రవేశపెట్టిన ఆ శాఖ మంత్రి, రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని 5,329 టాస్మాక్‌ మద్యం దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలకు సమీపంలో ఉన్న దుకాణాలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో పున్న దుకాణాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్న దుకాణాల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం, 500 దుకాణాలు గురువారం నుంచి మూతపడనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వాటిలో కోవై మండలంలో 78, మదురై మండలంలో 125, సేలం మండలంలో 59, తిరుచ్చి మండలంలో 100 దుకాణాలున్నాయి. చెన్నై మండల పరిధిలోని చెన్నై జిల్లాలో 61, కాంచీపురంలో 31, తిరువళ్లూర్‌లో 46 దుకాణాలు మూతపడనున్నాయి. కాగా, మూతపడిన దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బంది వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love