కడుపులోనే క్లాత్‌

– ఆపరేషన్‌ చేసి మరిచిపోయిన డాక్టర్లు
– సంవత్సరం కాలంగా ఇబ్బంది పడ్డ రోగి
– సాయి రక్ష హస్పిటల్‌ నిర్వాకం
నవతెలంగాణ-నల్లగొండ
అనారోగ్యంతో ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరిన మహిళకు ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేసి కడుపులో క్లాత్‌ను వదిలేసి కుట్లు వేసి డిశ్చార్జ్‌ చేశారు. దాంతో ఆ మహిళకు కడుపులో ఇన్ఫెక్షన్‌ పెరిగి సంవత్సర కాలంగా తీవ్ర ఇబ్బంది పడింది. ఇటీవల ఆమెకు కడుపునొప్పి విపరీతంగా పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేనిలో చేరింది. ఆ మహిళకు స్కానింగ్‌ చేయగా.. కడుపులో క్లాత్‌ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నిర్వాకం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సాయి రక్ష హస్పిటల్‌లో జరిగిందని డాక్టర్ల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..
మునుగోడుకు చెందిన వసంత ఏడాది కిందట జిల్లా కేంద్రంలోని సాయి రక్ష హాస్పిటల్‌లో అనారోగ్యంతో చేరింది. దాంతో ఆస్పత్రి డాక్టర్లు మహిళకు ఆపరేషన్‌ చేశారు. ఆసమయంలో కడుపులో క్లాత్‌ మర్చిపోయారు. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత వసంత మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురై ఏడాది కాలంగా కడుపునొప్పితో బాధపడుతూనే ఉంది. అయితే రెండు రోజుల క్రితం సమస్య తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌ కామినేనిలో చేర్పించగా డాక్టర్లు వసంత కడుపులో క్లాత్‌ ఉండటం ద్వారా ఇన్ఫెక్షన్‌ అయ్యిందని, వెంటనే ఆమెకు అపరేషన్‌ చేసి క్లాత్‌ను బయటకు తీశారు. కాగా, పేషెంట్‌ ప్రాణాలతో చెలగాటమాడిన సాయిరక్ష హాస్పిటల్‌ను సీజ్‌ చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love