నేటి నుంచి సీఎం కప్‌ టోర్నీ

మండల స్థాయి పోటీలు షురూ
నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర క్రీడా సంబురాలకు రంగం సిద్ధం. సీఎం కప్‌ 2023 టోర్నీలో తొలి అంచె పోటీలు నేడు మండల స్థాయిలో ఆరంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 612 మండల కేంద్రాల్లో సీఎం కప్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. మండల కేంద్రాల్లో పోటీల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు నేడు మండల స్థాయిలో సీఎం కప్‌ పోటీలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఈడిగ ఆంజనేయ గౌడ్‌లు సైతం నేడు ఎంపిక చేసిన మండల కేంద్రాల్లో సిఎం కప్‌ పోటీలకు హాజరు కానున్నారు. సీఎం కప్‌ పోటీల్లో మండల స్థాయిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. తొలుత ఫుట్‌బాల్‌ను పురుషులకు మాత్రమే షెడ్యూల్‌ చేయగా.. రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం విజ్ఞప్తితో మహిళలకు సైతం ఫుట్‌బాల్‌ను షెడ్యూల్‌ చేశారు. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. సోమ, మంగళ, బుధ వారాల్లో మండల స్థాయిలో సీఎం కప్‌ పోటీలు జరుగుతాయి. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జిల్లా స్థాయి సీఎం కప్‌ పోటీలకు ఎంపిక చేయనున్నారు.

Spread the love