రాహుల్‌ గాంధీపై సీఎం హిమంత ఆగ్రహం..

నవతెలంగాణ -హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్‌లో మొదలైన ఈ యాత్ర రెండు రోజుల క్రితం అస్సాంకు చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా రాహుల్ జోడో యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నది. సోమవారం అస్సాంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు రాహుల్‌ను అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్‌ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు. అయినా రాహుల్‌గాంధీ ఇవాళ మోరెగావ్‌లో పాదయాత్రకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడ ఉన్న బారికేడ్లను తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు గానూ రాహుల్‌పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులను సీఎం హిమంత ఆదేశించారు.

Spread the love